హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ బాలల వసతి గృహంలో పిల్లలను లైంగిక వేధించిన కేసులో నిందితుడైన సూపర్వైజర్ మహమ్మద్ రహమాన్ సిద్ధిఖీ విడుదలకు ఆదేశించేందుకు హైకోర్టు నిరాకరించింది. సైదాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సిద్ధిఖీ జ్యుడిషియల్ కస్టడీ నుంచి విడుదల చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ అతని సోదరుడు దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ను కొట్టేసింది. నిందితుడిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నందున ప్రస్తుత దశలో జోక్యం చేసుకోబోమని తేల్చిచెప్పింది. ఈ మేరకు జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ జారీచేసింది.