హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం అమలు చేస్తున్న ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) నిధికి బేసిక్ పేలో 15% తప్పనిసరి కోత విధిస్తూ జారీచేసిన నంబర్ 186, 79 జీవోలపై వివరణ ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ జీవోలను సవాలు చేస్తూ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నిజాముద్దీన్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఉద్యోగులతోపాటు పెన్షనర్ల నుంచి కూడా తప్పనిసరిగా నిధులు వసూలు చేయడం చట్టబద్ధం కాదని పేర్కొన్నారు. ఆ రెండు జీవోలను రద్దు చేయడంతోపాటు ఇప్పటికే వసూలు చేసిన మొత్తాలను తిరిగి చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును కోరారు. దీంతో ఆ జీవోలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం.. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఈ లోగా పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది.
కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలపై వివరణ ఇవ్వండి ; ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల అమలుకు సంబంధించి 2014 నుంచి జారీచేసిన 8 జీవోలపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ రెండు సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన జీవోలను సవాలు చేస్తూ న్యాయవాది విజయ్ పాల్ దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరుగడంతో.. ఇది ప్రభుత్వ విధాన నిర్ణయమని, పేద అవివాహిత యువతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ఈ పథకాల్లో కోర్టులు ఎలా జోక్యం చేసుకోవాలని జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ ప్రశ్నించారు. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ఈ పథకాలపై తమకు అభ్యంతరం లేదని, కానీ వాటి అమలు విధానం రాజ్యాంగబద్ధంగా లేదని తెలిపారు. దీంతో కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల అమలుకు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేశారు.