High Court | హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): చెరువులు, కుంటలు వంటి జలవనరుల పరిధిలో భవన నిర్మాణాలకు ముందుగా అనుమతులిచ్చి.. ఇప్పుడు అవి అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేస్తే ఎలాగని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. అక్రమమని తెలిసి కూడా అనుమతులు ఇచ్చి, ఇప్పుడు వాటిని కూల్చివేస్తే వాటికి నష్టపరిహారాన్ని అధికారులే చెల్లించాల్సి ఉంటుందని ఉన్నత న్యాయస్థానం హెచ్చరించింది. అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. ఇక మీదట అక్రమ నిర్మాణాల కూల్చివేతల వ్యవహారంలో వాటికి అనుమతులు ఇచ్చిన సంబంధిత అధికారుల ఆస్తుల జప్తునకు ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. అనుమతులు ఉన్న వాటిని అక్రమ నిర్మాణాలని కూల్చివేస్తే వాటి బాధితులకు నష్టపరిహారాన్ని ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరంలేదని స్పష్టంచేసింది. ప్రభుత్వం ప్రజా ధనాన్ని బాధితులకు పరిహారంగా చెల్లించడానికి వీల్లేదని చెప్పింది.
అధికారుల తప్పులకు ప్రభుత్వ ధనాన్ని ఎందుకు చెల్లించాలని ప్రశ్నించింది. అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చిన అధికారుల నుంచే పరిహారం మొత్తాన్ని రాబట్టాలని, వారి ఆస్తులను జప్తుచేస్తే జేజమ్మలు దిగొస్తారని వ్యాఖ్యానించింది. అధికారుల ఆస్తులను జప్తు చేస్తే అప్పుడు వాళ్లకు తాతలు కనిపిస్తారని కూడా వ్యాఖ్యానించింది. చెరువులు, కుంటలు వంటి జలవనరుల సంరక్షణ ముఖ్యమేనని, అయితే వాటి పరిధిలో, అదీ అధికారుల అనుమతులతో నిర్మాణాలు చేశాక ఇప్పుడు వాటిని అక్రమమని నోటీసులు ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భవనాలకు అనుమతులిచ్చి తీరా అకడ నిర్మాణాలు పూర్తయ్యాక బఫర్‌జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో అవి ఉన్నాయని, కూల్చివేస్తామని నోటీసులు జారీ చేయడంలో అధికారుల ఆంతర్యం ఏమిటని మండిపడింది.
అనుమతులిచ్చిన అధికారుల మాటేమిటి?
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మంగర్షికుంట బఫర్‌జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాల తొలగింపునకు నీటిపారుదల శాఖ అధికారులు ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ సచిన్ జైస్వాల్ సహా ముగ్గురు పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ సీవీ భాసర్‌రెడ్డి బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు నోటీసులు జారీచేస్తూ.. ఏడు రోజుల్లో బఫర్‌జోన్, ఎఫ్టీఎల్ పరిధిలోని నిర్మాణాలను తొలగించాలని ఆదేశించారని తెలిపారు. అనుమతులు తీసుకొని నిర్మించుకున్న రేకుల ఇండ్లను కూల్చివేసేందుకు చర్యలు తీసుకోనున్నారని చెప్పారు. వాదనల తర్వాత హైకోర్టు స్పందిస్తూ.. అధికారుల అనుమతులతో నిర్మించుకున్న ఇండ్లను కూల్చివేస్తామంటే ఎలాగని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
బఫర్‌జోన్, ఎఫ్టీఎల్ పరిధి తొమ్మిదో లేదా పదో మీటర్లు ఉంటుందని, నీటిపారుదల, పురపాలక శాఖలు, గ్రామ పంచాయతీ అధికారుల అనుమతులు తీసుకొని నిర్మించిన తర్వాత ఇప్పుడు అక్రమ నిర్మాణాలంటే ఎలాగని ప్రశ్నించింది. చెరువులను పరిరక్షించాలని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని, అదే సమయంలో అన్ని అనుమతులతో కట్టుకున్న నిర్మాణాలను కూల్చివేస్తే, మరి అనుమతులు ఇచ్చిన అధికారుల మాటేమిటని నిలదీసింది. అవి అక్రమ నిర్మాణాలని తేలినప్పుడు తగిన నోటీసులు జారీచేసి వారి వివరణ తీసుకుని చర్యలు తీసుకోవాల్సి వుంటుందని స్పష్టంచేసింది. నీటిపారుదల శాఖ అధికారులు జారీ చేసిన నోటీసులపై పిటిషనర్లు 15 రోజుల్లో అన్ని ఆధారాలతో, తగిన పత్రాలతో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. గోడకు అంటించిన నోటీసుల ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోరాదని నీటిపారుదల శాఖ అధికారులకు తేల్చి చెప్పింది.