హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుస్సేన్ జన్మించిన ఇంటిని చారిత్రక భవనంగా ప్రకటించాలన్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. హైదరాబాద్ బేగంబజార్‌లోని ఆ ఇంటిలో జాకీర్ హుస్సేన్ 8 ఏండ్లపాటు నివసించారని, దాన్ని చారిత్రక భవనంగా ప్రకటించేలా కేంద్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయాలన్న పిటిషనర్ అభ్యర్థనను తోసిపుచ్చింది. ఆ భవనాన్ని కేంద్రం చారిత్రక భవనంగా గుర్తించకపోవడాన్ని సవాల్ చేస్తూ 2014లో ఘనశ్యాం భాటి అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ ఇటీవల విచారణ జరిపారు.
మాజీ రాష్ట్రపతి జన్మించారన్న ఒకే ఒక కారణం తప్ప ఎలాంటి చారిత్రక ఆధారాలను పిటిషనర్ చూపలేదని పేర్కొన్నారు. ఆ భవనంలో లీజుకు కిరాణా దుకాణాన్ని నిర్వహిస్తున్నారని పేర్కొంటూ వ్యాజ్యం వేసే అర్హత పిటిషనర్‌కు లేదని స్పష్టం చేశారు. కూలిపోయే దశలో ఉన్న ఆ భవనాన్ని చారిత్రక భవనంగా ప్రకటించడంపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమేనని రాష్ట్ర ప్రభుత్వం చేసిన వాదనను పరిగణనలోకి తీసుకున్నారు. ఏదైనా భవనాన్ని చారిత్రకమైనదిగా ప్రకటించేందుకు చట్టంలో ఏ విధానమూ లేదన్నారు. ఆ భవనాన్ని లీజుకున్న వ్యాపారి పిటిషన్ వేశారని తప్పుపడుతూ.. ఆ పిటిషన్‌ను డిస్మిస్ చేశారు.