Operation Musi | హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 14(నమస్తే తెలంగాణ): మూసీ ప్రక్షాళన పేరిట కూల్చివేతలకు సిద్ధమైన రేవంత్రెడ్డి సర్కార్కు మూసీ పరీవాహక ప్రజలు షాకులిస్తున్నారు. తమ ఇండ్లను కూల్చవద్దంటూ కోర్టులను ఆశ్రయిస్తున్నారు. రేపోమాపో రెండో దఫా కూల్చివేతలకు ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో కోర్టుల ద్వారా స్టే ఆర్డర్లు తెచ్చుకుంటున్నారు. మూసీ అభివృద్ధి పేరిట ప్రభుత్వం పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ఇండ్లను ఇప్పటికే రివర్ బెడ్ మార్కింగ్ చేసింది. వీటిని దశల వారీగా కూల్చనున్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బుల్డోజర్లు తమ ఇంటిపైకి రాకముందే మూసీ పరీవాహక ప్రజలు తమ ఇండ్లకు కోర్టు ఆదేశాలను రక్షణ కవచంలా ఏర్పాటు చేసుకుంటున్నారు. తొలి దశలో మార్కింగ్ చేసిన నిర్మాణాలను కూల్చివేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్న నేపథ్యంలో మలక్పేట నుంచి నాగోల్ వరకు మూసీ వెంబడి ఉన్న పలు కాలనీ వాసులు ఇండ్ల కూల్చివేతలకు వ్యతిరేకంగా స్టే ఆర్డర్లు తెచ్చుకున్నారు. ఫణిగిరి కాలనీల్లో దాదాపు 25 నిర్మాణాలకు కోర్టు ఆదేశాలను అతికించగా, కోర్టు విచారణలో ఉందనీ, కూల్చివేతలు చేపట్టడానికి వీల్లేదని తెలుపుతూ నోటీసు బోర్డులను ఇండ్లకు అతికించారు.
బాధితులకు అండగా కోర్టులు
ఎలాంటి దిశానిర్దేశం, పారదర్శకత,ప్రణాళికలు లేకుండానే మూసీ పరీవాహక ప్రాంతాల్లో ప్రభుత్వం కూల్చివేతలకు దిగుతున్నది. ఈ క్రమంలో రివర్ బెడ్, ఎఫ్ఆర్ఎల్ హద్దులను ఏ ప్రామాణికతతో గుర్తించి మార్కింగ్ చేశారనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. ఈ క్రమంలో అన్ని అనుమతులతో ఎప్పుడో నిర్మించుకున్న ఇండ్లను కూల్చివేసేందుకు అంగీకరించని యజమానులు కోర్టులను ఆశ్రయించి ప్రభుత్వ దూకుడుకు ముకుతాడు వేస్తున్నారు. ఇప్పటి వరకు 100 మందికిపైగా స్టే ఆర్డర్లు తెచ్చుకున్నట్టు తెలిసింది.