హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అగ్నిమాపక శాఖలో సర్వీస్ నిబంధనలు రూపొందించడంలో తాత్సారం చేస్తున్న రాష్ట్ర సర్కారుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. సర్వీస్ నిబంధనలు రూపొందించేందుకు సిద్ధంగానే ఉన్నామని చెప్పిన ప్రభుత్వం వాయిదాలు అడగడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. జూలై 17న జరిగే విచారణ నాటికి ఫైర్ రూల్స్ రూపొందించాల్సిందేనని జస్టిస్ పీ శ్యాంకోళీ, జస్టిస్ నందికొండ నర్సింగ్‌రావుతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. లేదంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్వయంగా కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలని హెచ్చరించింది.
అగ్నిమాపక శాఖ సబార్డినేట్ సర్వీస్ నిబంధనలను రూపొందించకపోవడాన్ని సవాలు చేస్తూ పీ గోవింద్ తదితరులు దాఖలు చేసిన వ్యాజ్యంపై ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. తెలంగాణ ఫైర్ సర్వీస్ యాక్ట్ ప్రకారం రూల్స్ రూపొందించాలని, 1992 రూల్స్‌కు విరుద్ధంగా నియామకాలు, ఉద్యోగోన్నతులు చేపట్టవద్దని పిటిషనర్ల వాదనలు వినిపించారు. స్టేట్ ఫైర్ సర్వీసెస్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ సిద్ధంగా ఉన్నాయని, శాఖాపరమైన అనుమతుల కోసం గడువు కావాలంటూ ప్రభుత్వం వాయిదాలు కోరుతున్నది. రెండు నెలల క్రితం వాయిదా అడిగి ఇప్పటివరకు అనుమతులు తీసుకోకపోవడం శోచనీయమని, తాజాగా మళ్లీ నాలుగు వారాల గడువు కావాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి కోరడం ఎంతమాత్రం సమర్థ్ధనీయం కాదని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. తుది విచారణ జూలై 17కు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఈ సారి హామీ ఉల్లంఘిస్తే సీఎస్ కోర్టుకు రావాల్సి ఉంటుందని పునరుద్ఘాటించింది.