High Court | హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ) : ఆదివారం లేదా ఇతర సెలవు దినాల్లో కూల్చివేత చర్యలు చేపట్టిన హైడ్రాపై మరోసారి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సెలవు దినాల్లో ఎందుకు కూల్చాల్సి వస్తున్నదని నిలదీసింది. కూల్చివేతల్లో ఎందుకంత హడావుడి చేస్తున్నారని మండిపడింది. నోటీసులిచ్చి తగిన వివరణ ఇచ్చేదాకా ఆగకుండా కూల్చాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. నోటీసులు జారీచేసిన వెంటనే సమాధానం ఇవ్వడానికి తగిన గడువు ఇవ్వకుండా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడాలోని నిర్మాణాలను ఆదివారం కూల్చివేతలు చేపట్టడాన్ని సవాల్ చేస్తూ ఎస్ బాల్‌రెడ్డి అత్యవసరంగా హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేయగా, పిటిషన్‌ను జస్టిస్ కే లక్ష్మణ్ ఆదివారం విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ శుక్రవారం నోటీసులు జారీచేసి, శనివారమే వివరణ ఇవ్వాలని ఆదేశించారని, ఆదివారమే కూల్చివేత చర్యలు చేపడుతున్నారని వివరించారు. నోటీసులు జారీచేశాక ఆధారాలు సమర్పించి, వివరణ ఇవ్వడానికి గడువు ఇవ్వకుం డా కూల్చివేతలు చేపట్టడంపై మండిపడింది. ఎన్నిసార్లు చెప్పినా హైడ్రా తీరు మారడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కూల్చివేతలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి, నోటీసులపై వారంలోగా సమాధానమివ్వాలని పిటిషనర్‌ను ఆదేశించింది.