కాంగ్రెస్ మీద పోరాడాలని చెప్తే, ఆ పార్టీతో కలిసి ఎందుకు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారు?
– రాష్ట్ర బీజేపీ నేతలకు
ఇటీవల ప్రధాని మోదీ చీవాట్లు! బీజేపీ మీద రాజకీయ సమరం చేయమంటే.. మీరేమో బీజేపీ మన మిత్రపక్షమనే భ్రమలో ఉన్నట్టున్నారు.
– టీపీసీసీ నేతలపై కొద్దిరోజుల క్రితం రాహుల్ గాంధీ అసహనం.
బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు ఉదంతం రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ బంధం ఎంతలా పెనవేసుకుపోయిందో, అధిష్ఠానాల ఆదేశాలకు భిన్నంగా మైత్రితో వ్యవహరిస్తున్నాయో తేటతెల్లమైంది. రెండుజాతీయ పార్టీల రాష్ట్ర నాయకత్వాలు.. నెరుపుతున్న కుమ్మక్కు రాజకీయంతో ఆ పార్టీల అధిష్ఠానాలు
జాతీయ స్థాయిలో ఇరకాటంలో పడ్డాయి.
హైదరాబాద్, మే 16(నమస్తే తెలంగాణ): బండి భగీరథ్ వ్యవహారం రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ మెడకు చుట్టుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎప్పటినుంచో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణలున్నాయి. ఇప్పుడు భగీరథ్ విషయంలో ఆధారాలతో సహా బయటపడింది. ఓ బాలిక పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కినప్పటి నుంచి, లైంగిక నేరారోపణలు ఎదుర్కొంటున్న భగీరథ్ అరెస్ట్ కాకుండా 9 రోజులపాటు జరిగిన హైడ్రామాతో బీజేపీ, కాంగ్రెస్ నేతల దోస్తీ బట్టబయలైంది.
బాలిక తల్లి ఈ నెల 8న పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 6గంటల పాటు ప్రాధేయపడినా పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదని ఆమె ఆరోపించారు. పైగా అదే రోజు రాత్రి కరీంనగర్ పోలీసులు బాలికతోపాటు ఆమె తల్లిదండ్రుల మీద హనీట్రాప్ కేసు నమోదు చేశారు. భగీరథ్‌కు స్టేషన్ బెయిల్ వచ్చేలా సాధారణ సెక్షన్లు పెట్టిన పోలీసులు, బాధిత బాలిక మీద మాత్రం నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైలుకు పంపే కుట్రలు చేశారు.
ప్రధాని మోదీ పర్యటనను అడ్డుపెట్టుకొని మూడు రోజుల పాటు బాలిక కేసు విషయంలో తాత్సారం చేయగా, ఆ తర్వాత కూడా ఇదే డ్రామా కొనసాగింది. బీజేపీ, కాంగ్రెస్ నేతల కుమ్మక్కు కుట్రలను ‘నమస్తే తెలంగాణ’ పసిగట్టింది. ప్రత్యేక కథనాలతో కేంద్ర రాష్ట్ర పాలకుల తీరు ఎండగట్టింది. సోషల్ మీడియాలో నెటిజన్లు బాధిత బాలికకు అండగా నిలిచారు. భగీరథ్‌ను అరెస్ట్ చేయాలని ప్రజలతో పాటు ప్రజా, మహిళా, యువజన సంఘాలు రోడ్ల పైకి వచ్చి ధర్నాలు చేశాయి. ఈ నిరసన ప్రదర్శనల సెగ ఢిల్లీని తాకింది. రెండు జాతీయ పార్టీల అధిష్ఠానాలు ఉలిక్కిపడ్డాయి.
రాష్ట్రంలో ఏం జరుగుతున్నదని కేంద్ర ప్రభుత్వం గవర్నర్ శివప్రతాప్ శుక్లా నుంచి నివేదిక తెప్పించుకోగా.. రాహుల్‌గాంధీ స్వయంగా ముఖ్యమంత్రికి ఫోన్ చేసి వచ్చినట్టు తెలిసింది. సీఎం ఇచ్చిన సమాధానంతో రాహుల్ సంతృప్తి చెందలేదని, పూర్తి వివరాలతో ఢిల్లీకి రావాలని మంత్రి వివేక్‌ను ఆదేశించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. గవర్నర్ శుక్రవారం హుటాహుటిన ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఈ భేటీలో భగీరథ్‌పై పోక్సో కేసు వ్యవహారంపై ఆయన నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. ఫిర్యాదు ఇచ్చినప్పటి నుంచి మొదలు భగీరథ్ తప్పించుకు తిరుగుతున్న తీరు, తదనంతరం రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను అమిత్ షాకు వివరించినట్టు తెలిసింది. గవర్నర్ నివేదికతో సీరియస్ అయిన అమిత్ షా.. కేంద్ర సహాయ మంత్రికి ఫోన్ చేసి చీవాట్లు పెట్టినట్టు తెలిసింది. నిర్భయ కేసుతోనే ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ.. బాలికపై లైంగిక దాడి కేసులో చట్టంతో ఆడుకుంటావా? అని సీరియస్ అయినట్టు తెలిసింది. మీ వల్ల పార్టీ ఉనికి ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చిందని, వెంటనే పోలీసులకు అప్పగించి, విచారణకు సహకరించాలని ఆదేశించినట్టు సమాచారం. ఆయన ఆదేశాల మేరకే బండి భగీరథ్ పోలీసులకు లొంగిపోయినట్టు చర్చ జరుగుతున్నది.
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను, మహిళా సంఘాల ఉద్యమాలను, సోషల్ మీడియా పోస్టులను గమనించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫోన్ చేసినట్టు తెలిసింది. పార్టీపరంగా, ప్రభుత్వపరంగా మనం బదనాం అవుతూ కేంద్ర మంత్రి కుమారుడిని కాపాడాల్సిన అవసరం ఏమున్నదని నిలదీసినట్టు సమాచారం. రేవంత్‌రెడ్డి ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందక, రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారంపై నివేదిక తెప్పించాలని ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు సూచించినట్టు తెలిసింది. ఆయన రాష్ట్ర మంత్రి వివేక్‌కు ఫోన్ చేసి భగీరథ్ కేసుపై పూర్తి నివేదికతో ఢిల్లీకి రావాలని ఆదేశించినట్టు సమాచారం. మంత్రి వివేక్ శనివారం ఢిల్లీకి వెళ్లారు. రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారం, కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను ఖర్గేకు వివరించినట్టు తెలిసింది. అనంతరం ఖర్గే స్వయంగా రాహుల్ అపాయింట్మెంట్ తీసుకొని వివేక్‌ను అక్కడికి పంపినట్టు సమాచారం. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలోనే ఉన్నా, రాహుల్ గాంధీ ఆయన్ను నమ్మలేదని, అందుకే వివేక్ నుంచి సమాచారం తెప్పించుకున్నట్టు ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి.