రంగారెడ్డి, మార్చి 31 (నమస్తే తెలంగాణ) ; రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మంత్రి పదవుల భర్తీకి అధిష్ఠానం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటివరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మంత్రివర్గంలో స్థానం లేనందున ఈసారి మంత్రివర్గ విస్తరణపై ఆశలు పెంచుకున్నారు. అందులో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మొదటి స్థానంలో ఉన్నారు. కాని, అధిష్ఠానం నుంచి సానుకూల సంకేతాలు లేకపోవటంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలంతా (కాంగ్రెస్ పార్టీ) ఒక నిర్ణయానికొచ్చారు. తమలో ఎవరికి అవకాశమిచ్చినా అందరం సర్దుకుంటామని కాంగ్రెస్ అధిష్ఠానానికి లేఖ రాశారు. మంత్రివర్గ విస్తరణలో తమ సామాజికవర్గమే అడ్డనుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల అభ్యర్థిని నిలిపి గెలిపించుకుని తీసుకువస్తానని.. ఆయనకైనా మంత్రివర్గంలో స్థానం ఇవ్వాలని ఇప్పటికే మల్రెడ్డి రంగారెడ్డి కోరారు. మంత్రివర్గంలో స్థానం కల్పించకపోతే తాను రాజీనామా చేస్తానని మల్రెడ్డి రంగారెడ్డి ఇప్పటికే బాహాటంగా తన నిర్ణయాన్ని ప్రకటించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 14 స్థానాల్లో ఐదు చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుపొందారు. వీరిలో మల్రెడ్డి రంగారెడ్డి(ఇబ్రహీంపట్నం), ప్రసాద్‌కుమార్(వికారాబాద్), రామ్మోహన్‌రెడ్డి(పరిగి), మనోహర్‌రెడ్డి(తాండూరు), వీర్లపల్లి శంకర్(షాద్‌నగర్) ఉన్నారు. ఇప్పటికే వికారాబాద్ జిల్లా నుంచి గెలుపొందిన గడ్డం ప్రసాద్‌కుమార్‌కు స్పీకర్ పదవి దక్కింది. కాని, రంగారెడ్డి జిల్లాలో ఒక్కరికి కూడా మంత్రి పదవి దక్కలేదు.
అధిష్ఠానానికి లేఖ రాసిన ఎమ్మెల్యేలు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలంతా ఏకతాటిపైకి వచ్చి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరుతున్నారు. ఈ మేరకు తమలో ఎవరికైనా ఒకరికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరుతూ.. ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, మనోహర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్‌తోపాటు బీఆర్ఎస్ నుంచి గెలుపొంది కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, కాలె యాదయ్య తదితరులు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో పాటు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలకు కూడా లేఖ రాశారు.
ఎవరికి వారే..?
మరో రెండు మూడు రోజుల్లో రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించేందుకు అధిష్ఠానం ఆదేశాలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఆయన గవర్నర్‌ను కూడా కలిసి మంత్రివర్గ విస్తరణ గురించి తెలియజేసినట్లు తెలిసింది. మల్రెడ్డితోపాటు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి సైతం తాను రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనందున మంత్రివర్గ విస్తరణలో తనకు కూడా అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అలాగే, బీసీ కోటా నుంచి అవకాశం వస్తే తమ సామాజిక వర్గం నుంచి ఎక్కడా ప్రాతినిథ్యం లేనందున తనకే ఇవ్వాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సైతం కోరుతున్నట్లు తెలిసింది. అలాగే, చీఫ్ విప్ పదవిలో ఉన్న ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి సైతం తనకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఎవరికున్న మార్గాల్లో వారు మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుండగా.. మరో రెండు రోజుల్లో భవితవ్యం తేలనున్నది.