High Alert | దేశ రాజధాని ఢిల్లీ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రోస్టేషన్ సమీపంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఎనిమిది మంది మృతి చెందగా.. 24 మంది గాయపడ్డారు. దేశ రాజధానిలో పేలుడుతో కేంద్ర హోంమంత్రిత్వశాఖ అప్రమత్తమైంది. పలు రాష్ట్రాలను సైతం అప్రమత్తం చేసింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా పలు నగరాల్లో హై అలెర్ట్ ప్రకటించారు. ముంబయి, హైదరాబాద్, యూపీ లక్నో సహా పలు నగరాల్లో హై అలెర్ట్ ప్రకటించిన విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందలు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో రద్దీ ప్రాంతాల్లో వాహానాల తనిఖీలు, నాకాబందీ చేపట్టాలని సీపీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ నగరంతో పాటు యావత్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లకు కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. హైదరాబాద్‌లో సైతం పోలీసులు అప్రమత్తమయ్యారు. పలుచోట్ల పోలీసులు తనిఖీలు చేపట్టారు. అలాగే, పాతబస్తీలో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. రద్దీ ప్రాంతాల్లో వాహనాల తనిఖీ, నాకాబందీ ఏర్పాటు చేసినట్లు సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా.. మరేవైనా వస్తువులు కనిపించినా సమాచారం ఇవ్వాలని సజ్జనార్ కోరారు. డయల్ 100 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రైల్వేస్టేషన్లలోనూ తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ముంబయిలో తనిఖీలు..
ఢిల్లీ పేలుడు తర్వాత ముంబయి నగరం అంతటా భద్రతను పెంచారు. పెట్రోలింగ్, నాకాబందీ ఏర్పాటు చేశారు. పేలుడు సమాచారం అందుకున్న వెంటనే ముంబయిలోని అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేసి.. జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు. రైల్వే స్టేషన్లు, మార్కెట్లు, ఆధ్యాత్మిక ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలు, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలు, సున్నిత ప్రదేశాల్లో గస్తీని పెంచాలని ఆదేశించారు. కీలకమైన జంక్షన్లలో నాకాబందీ నిర్వహించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఏదైనా ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని.. గ్రౌండ్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్‌ను పూర్తిగా ఉపయోగించుకోవాలని ఆదేశించారు.