హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): తన ఎన్‌కౌంటర్‌ను ముందే ఊహించిన హిడ్మాకు తెలంగాణ ప్రభుత్వం మొండిచేయి చూపించిందా? రాజ్యాంగం పట్టుకొని నినాదాలు చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్‌నేతలు.. లొంగిపోయేందుకు వచ్చిన హిడ్మాను ఉద్దేశపూర్వకంగానే ఏపీ వైపు నడిపించారా? తెలంగాణ ప్రభుత ్వం ఆశ్రయమిస్తే హిడ్మా ప్రాణాలతో బతికిపోయేవాడా? అంటే అవుననే అంటున్నాయి పౌరహక్కుల, ప్రజా సంఘాలు. ఛత్తీస్‌గఢ్, ఏపీ, ఒడిశా, మహారాష్ట్ర కంటే తనకు సేఫ్ జోన్‌గా ఉన్న తెలంగాణలోనే లొంగిపోయేందుకు మద్వి హిడ్మా ప్రత్యేక చొరవ చూపాడని అంటున్నాయి. ఈ లొంగుబాటు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కొంచం చొరవ చూపి, సానుభూతితో వ్యవహరించి ఉంటే.. హిడ్మా బతికిపోయేవాడని అంటున్నారు. ఈ నెల మొదటి వారంలోనే తెలంగాణ ప్రభుత్వంతో హిడ్మా సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. అతడు పెట్టిన డిమాండ్లకు ఇక్కడి ప్రభుత్వ పెద్దలు భయపడిపోయారని విశ్వసనీయ సమాచారం. తనతో పాటు తన భార్య రాజేపై ఉన్న కేసులు మొత్తం ఎత్తివేయాలని హిడ్మా పట్టుబట్టినట్టు తెలిసింది. ఎలాగైనా హిడ్మాను ఎన్కౌంటర్ చేస్తారనే కోణంలో.. ఇక్కడి మావోయిస్టు సానుభూతిపరులు, కమ్యూనిస్టులు, ప్రజాసంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని గ్రహించి.. ఉద్దేశపూర్వకంగానే హిడ్మాకు లొంగుబాటు సంకేతాలు ఇవ్వలేదని పౌరహక్కుల నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీకి ఉప్పందించిన ఓ ఉన్నతాధికారి..
లొంగిపోయేందుకు ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్రతోపాటు.. తెలంగాణను కూడా హిడ్మా సంప్రదించిన విషయాన్ని ఓ ఉన్నతాధికారి ఏపీకి ఉప్పందించినట్టు మావోయిస్టు సానుభూతి వర్గాలు అనుమానిస్తున్నాయి. అప్పటికే తమను సంప్రదించిన హిడ్మా దళం ఎక్కడ ఉంది? ఎలా లొంగిపోవాలో? కూడా రూట్‌మ్యాప్ చెప్పినట్టు వారికి సమాచారం అందించడంతో.. ఓ మధ్యవర్తి ద్వారా ఏపీ నుంచి హిడ్మాతో సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. ఆశ్రయం ఇస్తుందనుకున్న తెలంగాణ నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడం, మరోవైపు కేంద్ర భద్రతా బలగాలు వేగంగా దూసుకొస్తుండటంతో ఏపీ వైపు హిడ్మా మొగ్గు చూపాడని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కేసుల ఎత్తివేతతోపాటు తనతో వచ్చిన వారికి ఏదో ఒక రీతిలో ఉపాధి అనేవి ప్రధాన అంశాలుగా ఉన్నట్టు కూటమి ప్రభుత్వం తెలుసుకున్నది. వాటినే ఆయుధాలుగా చేసుకొని తెలివిగా వ్యవహరించినట్టు విశ్వసనీయ సమాచారం. కేసుల మాఫీ విషయంలోనూ కేంద్రాన్ని, సీఆర్పీఎఫ్ను తాము ఒప్పిస్తామని తెలంగాణ సరిహద్దుల వైపు ఉన్నవారిని ఆంధ్రా సరిహద్దుకు మళ్లించినట్టు తెలిసింది.
‘యుద్ధనీతిని’ అమలు చేయాల్సిందే..
తెలంగాణలో లొంగిపోవాలనుకున్న వారికి హామీల గాలం వేసి, హిడ్మా బెటాలియన్ షెల్టర్జోన్ను ఏపీకి మార్పించినట్టు తెలిసింది. ఈ విషయాలను ఏపీలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేంద్రానికి, సీఆర్పీఎఫ్కు సమాచారం చేరవేసిందని అంటున్నారు. హిడ్మా లొంగుబాటును ఒప్పుకోని కేంద్ర పెద్దలు, సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు ‘యుద్ధనీతి’ని అమలు చేయాల్సిందేనని ఆదేశించినట్టు తెలిసింది. ‘ప్రాణానికి ప్రాణం’ అనే సూత్రం పాటించాలని చెప్పారట. ఈ వ్యవహారాన్ని రహస్యంగా నడిపించిన అక్కడి పోలీసు బాస్‌లు.. కేంద్ర పెద్దల సూచనల మేరకు హిడ్మాతో ఉన్న క్యాడర్‌ను అర్బన్ ప్రాంతానికి రప్పించారు. తర్వాత హిడ్మాను కుటుంబసమేతంగా మధ్యవర్తితో ఆహ్వానించారని తెలిసింది. దీంతో ఏపీ ప్రభుత్వాన్ని నమ్మిన హిడ్మా వేరే దళంలో ఉన్న భార్య రాజేను తీసుకొని ఆంధ్రాబార్డర్ వైపు అడుగులు వేశారని, మారేడుమిల్లికి చేరుకున్న తర్వాత ముందస్తు పథకంలో భాగంగా హిడ్మాను ఎన్కౌంటర్ చేశారని పౌర హక్కులు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి.
మన ప్రభుత్వ పెద్దల వైఫల్యంపై చర్చ..
హిడ్మా బూటకపు ఎన్కౌంటర్ మీద మావోయిస్టు సానుభూతిపరులు, తెలుగు రాష్ర్టాల కమ్యూనిస్టులు.. తెలంగాణ ప్ర భుత్వం, పోలీసుశాఖ వైఫల్యంపై చర్చించుకుంటున్నారు. తెలంగాణ మినహా చు ట్టూ అన్నీ బీజేపీ పాలిత రాష్ర్టాలైనప్పుడు హిడ్మా తెలంగాణలో లొంగిపోయేందుకు ఎంచుకోవడం సరైనదేనని అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో లొంగిపోతే ఆ క్రెడిట్ అంతా ప్రభుత్వానికి వచ్చే అవకాశం ఉన్నప్పుడు.. ఉద్దేశపూర్వకంగానే ఆదేశాలు ఇవ్వలేదని సంఘాలు మండిపడుతున్నాయి. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని మండిపడుతున్నాయి. అతని లొంగుబాటు చూపించి.. కేసులు పెట్టి, విచారణకు ఆదేశించినా హిడ్మా బతికేవాడని, ఇట్లాంటి సున్నిత విషయాల్లో తెలంగాణ ప్రభుత్వం చొరవగా నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమైందని సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఇదేనా రాజ్యాంగబద్ధ ప్రజాపాలన అని నిలదీస్తున్నారు. రాజ్యాంగాన్ని అమలుచేయడం.. ప్రచారం చేసినంత సులువు కాదని మండిపడుతున్నారు. భవిష్యత్‌లో లొంగిపోతామని వచ్చే వారినైనా కాపాడుకోవాలని సూచిస్తున్నారు. పేరుకే రాజ్యాంగం పట్టుకోవడం కాదని.. దానిని చిత్తశుద్ధితో చేతల్లో చూపించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి హితవు పలుకుతున్నారు.