హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): మావోయిస్టు అగ్రనేత హిడ్మా లొంగిపోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న నేపథ్యంలోనే ఆయన ఎన్కౌంటర్లో చనిపోయినట్టు తెలుస్తున్నది. హిడ్మా ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌కు చెందిన ఓ సీనియర్ జర్నలిస్టుకు రాసినదిగా భావిస్తున్న ఓ లేఖ బుధవారం వెలుగులోకి వచ్చింది. సహచరులపై నమ్మకం తగ్గిపోయిందని, వరుస సంఘటనలను చూస్తుంటే అడవి నుంచి బయటపడటం తప్ప మరో మార్గం లేదని అర్థమైందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. హిడ్మా ఎన్‌కౌంటర్‌కు ముందుగానే అడవి నుంచి బయటికి రావాలని భావించారని ఆ జర్నలిస్టు చెప్పారు. సదరు జర్నలిస్టు ఇటీవల జగదల్పూర్లో రూపేశ్ సహా 210 మంది మావోయిస్టులు లొంగిపోయేందుకు మధ్యవర్తిత్వం వహించారు. ఈ క్రమంలో హిడ్మా కూడా లొంగిపోయేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ ఈ నెల 10న తనకు లేఖ రాశారని ఆ జర్నలిస్టు పేర్కొన్నారు. హిడ్మా తనను ముఖాముఖి సమావేశం కోసం ఆంధ్రప్రదేశ్ సరిహద్దులకు రావాలని కూడా కోరారని వెల్లడించారు.
పార్టీ లొంగుబాట్లకు సిద్ధంగా లేదు
హిడ్మా చివరిసారిగా రాసినట్టు చెప్తున్న లేఖ ప్రకారం.. ‘లొంగుబాట్లకు చాలా సమస్యలు, భద్రతా ప్రమాదాలు ఉన్నందున మొత్తం పార్టీ లొంగిపోవడానికి సిద్ధంగా లేదు. మా ప్రాధాన్యం ఆధారంగా మీరు సహాయం అందిస్తే.. ప్రభుత్వం మేము లొంగిపోవడానికి సరైన స్థానాన్ని నిర్ణయించాల్సి ఉంటుంది. మా భద్రతకు హామీ ఇస్తే, మేము మిమ్మల్ని కలవవచ్చు. ఇతర బలగాలు చాలా దూరంలో ఉన్నందున, భద్రతా బలగాల కూంబింగ్ ప్రమాదంతో వారు వెంటనే స్పందించలేరు. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం గురించే నా ఆందోళన. సహచరులపై నమ్మకం తగ్గిపోయింది.
వరస ఆపరేషన్లు, హత్యలు, లొంగుబాట్లను చూసినప్పుడు.. అడవి నుంచి బయటపడటం తప్ప మరో మార్గం లేదని అర్థమైంది. వారినే నమ్ముకున్న నేను ఈ విషయంలో (బయటికి రావడానికి) ఆలస్యంగా వచ్చినందుకు చింతిస్తున్నా. మరో నాలుగైదు రోజుల్లో హిందీ, తెలుగులో ఆడియో ప్రకటన విడుదల చేస్తాను. ప్రభుత్వానికి లొంగిపోయే ముందు మా ఆందోళనకు సంబంధించిన విషయాలను చర్చించాలనుకుంటున్నా..’ అని హిడ్మా ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా, ఈ లేఖ ప్రకారం.. హిడ్మా లొంగిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే ఎన్కౌంటర్ జరగడంతో.. ఈ వ్యవహారంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.