హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): నాడు హైటెక్ సిటీతో హైదరాబాద్‌లో ఐటీ ప్రారంభించానని.. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ ద్వారా కృత్రిమ మేథ(ఏఐ)కి ప్రాధాన్యత ఇచ్చి తెలుగు జాతిని ముందుకు నడిపిస్తానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. మంగళవారం ఏపీలోని కడప శివారు చెర్లోపల్లిలో టీడీపీ మహానాడులో ఆయన మాట్లాడుతూ.. తెలుగు రాష్ర్టాల్లో ఏ పార్టీలో చూసినా టీడీపీ వర్సిటీ విద్యార్థులే ఉన్నారని.. మన పార్టీ చరిత్ర చింపేస్తే చిరిగేది కాదని పేర్కొన్నారు.
ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని స్పష్టంచేశారు. రూ.500 నోట్లు రద్దు చేయాలని మహానాడులో చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. డిజిటల్ కరెన్సీ వాడకం పెరిగిన నేపథ్యంలో అన్ని పెద్ద నోట్లను రద్దు చేస్తే అవినీతికి అడ్డుకట్ట పడుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో 5 రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్‌లు ప్రారంభిస్తున్నామని చంద్రబాబు తెలిపారు.