కరీంనగర్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాడి రైతు మెడపై ప్రాంతేతరుల కత్తి వేలాడుతున్నది. స్వరాష్ట్రంలో శ్వేత విప్లవానికి కేసీఆర్ ప్రభుత్వం బాటలు వేస్తే.. కాంగ్రెస్ సర్కారు కుట్రల కారణంగా విజయ డెయిరీతోపాటు మిగిలిన కో ఆపరేటివ్ డెయిరీల మనుగడ కూడా ప్రమాదంలో పడే అవకాశం కనిపిస్తున్నది. ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థ రాష్ట్రంలో రూ.200 కోట్లకుపైగా పెట్టుబడితో శామీర్‌పేటలో డెయిరీతోపాటు ఐస్‌క్రీం తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తున్నది. దీనికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంపూర్ణంగా సహకరిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలో పాలవిక్రయాల అతి పెద్ద మార్కెట్ హైదరాబాద్.
ఇక్కడ రోజుకు 20 లక్షల నుంచి 22 లక్షల లీటర్లకుపైగా డిమాండ్ ఉంది. ఈ డిమాండ్‌కు అనుగుణంగా మార్కెట్‌ను అందిపుచ్చుకోవడంలో విజయ డెయిరీ లాంటివి కాస్త వెనుకబడగా..ఇపుడు ఆ మార్కెట్‌ను ప్రాంతేతర డెయిరీలు ఆక్రమిస్తున్నాయి. హెరిటేజ్, జెర్సీ, అమూల్, నందిని వంటి డెయిరీలు.. స్థానిక డెయిరీలకు మించి మార్కెట్లో విక్రయాలు చేస్తున్నాయి. ఒక్క హెరిటేజ్ వాళ్లే రోజుకు హైదరాబాద్‌లో 5 లక్షల లీటర్లకు పైగా పాల విక్రయాలు చేస్తున్నట్టు సదరు రంగంలోని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ సంస్థ పెట్టుబడులు పెట్టి హైదరాబాద్ మార్కెట్ మొత్తం శాసిస్తే రాష్ట్రంలోని విజయ డెయిరీతోపాటు కోఆపరేటివ్ డెయిరీలైన కరీంనగర్, ముల్కనూరు వంటి వాటి భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకునే ప్రమాదమున్నది.
రైతుల ఆదాయంపై దెబ్బ?
నిజానికి పాడి పరిశ్రమను ఆహ్వానించడం ఎవరూ తప్పుపట్టరు. కానీ సదరు పరిశ్రమతో రాష్ట్రంలోని పాడిరైతులకు వచ్చే ప్రమాదాలను పట్టించుకోకుండా రేవంత్ సర్కారు ముందు కెళ్తున్న తీరుపై విమర్శలొస్తున్నాయి. ఇప్పటికే హెరిటేజ్‌లాంటి సంస్థల దాటికి విజయ డెయిరీ కుదేలవుతుండగా.. ఇపుడు ఇతర కో-ఆపరేటివ్ డెయిరీలకూ ముప్పు పొంచిఉన్నది. దీనికి కారణం తెలంగాణతో పోలిస్తే ఆంధ్రాలో రైతులకు ఇచ్చే ఒక లీటర పాల ధరలో రూ.4 నుంచి రూ.7 వరకు వ్యత్యాసం ఉండడమే. ప్రస్తుతం 3 శాతం ఫ్యాట్ ఉన్న పాలను కరీంనగర్ డెయిరీ లీటర్‌కు రూ. 35.65కు కొనుగోలు చేస్తుండగా.. ఏపీలోని చిత్తూరులో రూ.31.50కు కొనుగోలు చేస్తున్నారు. 3.5 శాతం ఫ్యాట్ ఉన్న లీటర్పాలను చిత్తూరులో రూ.33కు కొనుగోలు చేస్తుండగా, కరీంనగర్ డెయిరీ రూ.40.25కు కొనుగోలు చేస్తున్నది. అంటే ఒక్కో లీటర్‌పై రూ.4 నుంచి రూ.7 వరకు తేడా ఉన్నది. అక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేసి.. రాష్ట్రంలోని డెయిరీల మార్కెట్‌ను దెబ్బతీసేందుకు సరికొత్త స్కీమ్ పెట్టి లేదా.. ధర తగ్గించి సదరు కంపెనీలు పాలు అమ్మే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
హైదరాబాద్‌లో ఇప్పటికే పలు పాల కంపెనీలు ఈ తరహా మార్కెటింగ్‌కు పాల్పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రాంతేతర డెయిరీల పోటీని తట్టుకోవాలంటే రాష్ట్రంలోని కోఆపరేటివ్ డెయిరీలైన కరీంనగర్, ముల్కనూరు డెయిరీలు కూడా రైతుకు ఇచ్చే పాలసేకరణ ధరను తగ్గించాల్సి ఉంటుంది. పాల ధర తగ్గించకపోతే మార్కెట్ విక్రయాల్లో ఈ డెయిరీలు వెనుకబడిపోయే ప్రమాదమున్నది. తద్వారా డెయిరీలే మూతపడే ప్రమాదమున్నది. అదే జరిగితే కరీంనగర్, మూల్కనూరు డెయిరీ పరిధిలోనే దాదాపు 3 లక్షలకు పైగా పాడి కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదమున్నది. ప్రాంతేతర డెయిరీల మార్కెట్‌కు దీటుగా పాలసేకరణ ధరలు తగ్గిస్తే రైతులకు గిట్టుబాటు కావన్నది నిపుణుల అభిప్రాయం. ఆంధ్రాలోని పాడిరైతులకు వచ్చే ఖర్చుతో పొల్చితే.. తెలంగాణలో వాతావారణం, ఇతర మార్పుల నేపథ్యంలో 25 శాతానికిపైగా అదనపు ఖర్చు వస్తుందని పాడిపరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడి రైతాంగానికి సరిపడా రేటు గిట్టుబాటు అయ్యేందుకు కావాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టిపెటాలన్న అభిప్రాయాలు వ్యక్తవుతున్నాయి.