హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ చుట్టూ నలువైపులా నిర్మించబోయే ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ దవాఖానల్లో అత్యవసర పరిస్థితులు, అవయవాల తరలింపునకు ఎయిర్ అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు యోచిస్తున్నది. ఇందుకోసం నాలుగు దవాఖానల ప్రాంగణాల్లో హెలిప్యాడ్లు నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా స్థలాన్ని కూడా కేటాయించినట్టు సమాచారం.
అత్యవసర పరిస్థితుల్లో హెలికాప్టర్లు ల్యాండ్ అయ్యేందుకు, అవయవ మార్పిడి శస్త్రచికిత్సల్లో భాగంగా అవయవాల తరలింపునకు ఈ ఎయిర్ అంబులెన్స్ సేవలను వినియోగించనున్నారు. హైదరాబాద్ చుట్టూ గడ్డిఅన్నారం, ఎర్రగడ్డ ఛాతి దవాఖాన, అల్వాల్ ప్రాంతాల్లో నిర్మించనున్న దవాఖానలకు సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తి కాగా, త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్మించబోయే సూపర్ స్పెషాలిటీ దవాఖానల నిర్మాణానికి ఏప్రిల్ 26న ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.
పెరగనున్న పడకల సంఖ్య
సూపర్ స్పెషాలిటీ దవాఖానల నిర్మాణం పూర్తయితే కొత్తగా 4,000 పడకలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 1,300 సూపర్ స్పెషాలిటీ పడకలు ఉండగా, వీటితో కలిపితే 5,300కు చేరనున్నది. పడకలతోపాటు మెడికల్ సీట్లు పెరగనున్నాయి. స్వయం ప్రతిపత్తి(అటానమస్)తో నిర్వహించే ఈ దవాఖానల్లో 30 ప్రధాన విభాగాలు పనిచేస్తాయి.
ప్రధాన ఆస్పత్రులపై తగ్గనున్న భారం
సూపర్ స్పెషాలిటీ దవాఖానలు పూర్తయితే ఉస్మానియా, గాంధీ, నిమ్స్లపై ఒత్తిడి తగ్గనున్నది. ప్రస్తుతం ఈ మూడింటికి రాష్ట్రంలోని దూరప్రాంతాల నుంచి వచ్చే కాకుండా పొరుగు రాష్ర్టాల నుంచి రోగులు వస్తున్నారు. దీనివల్ల నిమ్స్ వంటి దవాఖానల్లో అత్యవసర పడకలు లభించడం కష్టంగా మారుతున్నది.