అచ్చంపేట, సెప్టెంబర్ 19 : ‘కాంగ్రెస్ ప్రభుత్వం నిద్రలోంచి బయటకు రావాలి.. రాష్ర్టాభివృద్ధితోపాటు తెలంగాణ నీటి వాటా కోసం గొంతెత్తాలి.. కొట్లాడి కేటాయించిన జలాలను సాధించుకోవాలి’ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటకు ఈ నెల 28న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానుండగా పర్యటన ఏర్పాట్లను మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు, మర్రి జనార్దన్‌రెడ్డి, జైపాల్ యాదవ్, స్థానిక నేతలు పరిశీలించారు. అనంతరం బీఆర్ఎస్ కౌన్సిలర్ రమేశ్‌రావు గృహంలో మీడియాతో మాట్లాడారు. కృష్ణానది ఎగువన కర్ణాటకలో సముద్రమట్టానికి 519 ఎత్తులో ఉన్న ఆల్మట్టి డ్యాంను 524 మీటర్ల ఎత్తుకు పెంచుతున్నారని తెలిపారు. దీంతో కన్నడ రాష్ట్రంలో లక్షా 50 వేల ఎకరాల భూమిని సేకరించడంతోపాటు వందలాది గ్రామాలు ముంపునకు గురికానున్నాయని చెప్పారు. నీటి కేటాయింపు ట్రిబ్యునల్ ఫైనల్ వాటా ఇచ్చే వరకు డ్యాం ఎత్తు పెంచే పనులు అడ్డుకోవాలని సూచించారు. రేవంత్ రేవంత్‌రెడ్డి ఆల్మట్టిపై ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. 28న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అచ్చంపేటకు వస్తున్నారని, సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సభలో వర్తమాన పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణ, స్థానిక సమస్యలు, రైతులు, కార్మికుల పరిస్థితి, ఇతర అంశాలపై చర్చ ఉంటుందన్నారు.