హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): వేల మంది డిపాజిటర్లను నిలువునా ముంచి రూ.3 వేల కోట్ల మేరకు మోసగించిన కేసులో హీరా గ్రూప్ సంస్థల అధినేత, ప్రధాన నిందితురాలు నౌహీరా షేక్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ధికరించి నకిలీ గుర్తింపు కార్డుతో హర్యానాలో తలదాచుకున్న ఆమెను ఈడీ అధికారులు పకా సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు. గురువారం అర్ధరాత్రి ఆమెను హైదరాబాద్‌లోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు ముందు హాజరుపరచడంతో న్యాయస్థానం రిమాండ్ విధించింది. వివరాల్లోకి వెళ్తే.. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా దాదాపు 1,72,114 మంది అమాయక పెట్టుబడిదారుల నుండి హీరా గ్రూప్ కంపెనీల పేరిట నౌహీరాషేక్ భారీగా డిపాజిట్లు సేకరించారు. ఏటా 36% వరకు లాభాలు ఇస్తామంటూ పెట్టుబడిదారులను నమ్మించి ఆ తర్వాత వారికి లాభాలతోపాటు అసలు మొత్తాన్ని కూడా చెల్లించకుండా మోసగించారు. దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు తెలంగాణ, ఏపీ పోలీసులు నమోదు చేసిన పలు ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ ఈ మనీలాండరింగ్ కేసు దర్యాప్తు ప్రారంభించింది. డిపాజిటర్ల సొమ్మును నౌహీరా షేక్ తన వ్యక్తిగత ఖాతాలకు మళ్లించి, భారీగా చరాస్తులు, స్థిరాస్తులను కొనుగోలు చేసినట్టు ఈడీ ఈ దర్యాప్తులో గుర్తించి, వాటిని జప్తు చేసింది.
నకిలీ పేరుతో గుర్గావ్లో ప్రత్యక్షం
నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ అయినప్పటి నుంచి హైదరాబాద్, బెంగళూరులో ఈడీ అధికారులు గాలించినా నౌహీరా దొరుకలేదు. ఆమె ఫోర్జరీ చేసిన ఆధార్ కార్డును ఉపయోగించి షేక్ ఖమర్ జహాన్ అనే నకిలీ పేరుతో హర్యానాలోని గుర్గావ్లో తలదాచుకున్నట్టు ఇంటెలిజెన్స్ సమాచారం రావడంతో ఈడీ అధికారులు ఈ నెల 21న హర్యానా పోలీసులతో కలిసి గుర్గావ్లోని సెక్టార్-45లో ఎయిర్ బీఎన్బీ ప్రాపర్టీపై సంయుక్తంగా దాడి చేశారు. నౌహీరాతో పాటు ఆమెకు సహకరించిన సమీర్ ఖాన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈడీ అధికారులను బెదిరించేందుకు ప్రయత్నించిన కల్యాణ్ బెనర్జీ అనే మరో వ్యక్తిని కూడా ఈడీ గతంలోనే సికింద్రాబాద్‌లో అరెస్టు చేసింది. దర్యాప్తు వేగంగా సాగు తున్నట్టు ఈడీ అధికారులు తెలిపారు.