నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఏప్రిల్ 10 : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం కురిసిన వడగండ్ల వాన రైతులకు కడగండ్లను మిగిల్చింది. అకాల వర్షానికి రైతులు వేల ఎకరాల్లో పంట నష్టపోయారు. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పలుచో ట్ల పంటచేలు నేలవాలాయి. చెట్లు కూలాయి. స్తంభాలు నేలకొరిగాయి. మామిడికాయలు నేలరాలాయి. మార్కెట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో భారీగా ధాన్యం తడిసింది. పలుచోట్ల పిడుగులు పడ్డాయి. సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలో వందల ఎకరాల్లో పంటకు నష్టం జరిగింది. ముస్త్యాలలో రైతు కేసిరెడ్డి సురేందర్‌రెడ్డికి చెందిన రూ.లక్షన్నర విలువైన జెర్సీ ఆవు పిడుగుపాటుకు గురై మృతిచెందింది. డోవూర్ గ్రామ శివారులో పిడుగుపడి రైతు బోజిరెడ్డి గేదె మృతి చెందింది.
సదాశివపేట పట్టణ పరిధిలోని సిద్ధాపూర్ శివారులో పిడుగుపాటుకు విద్యార్థి సంతోష్ మృతిచెందాడు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వందల ఎకరాల్లో పంట నేలపాలైంది. సిరిసిల్ల మార్కెట్ యార్డులో ఆరు రోజుల కిందట ధాన్యం తెస్తే ఇంత వరకు ఎవరూ పట్టించుకోలేదని రైతు ఎర్రం ఎల్లయ్య ఆవేదన వ్యక్తంచేశాడు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో ఆరబెట్టిన ధాన్యం తడిసింది. వ్యవసాయ మార్కెట్‌కు 1,871 క్వింటాళ్లు విక్రయానికి రాగా, సాయంత్రం కు రిసిన వర్షానికి దాదాపు వెయ్యి బస్తాల ధాన్యం తడిసింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మరిపిరాలలో వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు.