కామారెడ్డి: భారీ వర్షాల నేపథ్యంలో 44వ జాతీయ రహదారిపై (NH 44) భారీగా ట్రాఫిక్ జామ్ (Heavy Traffic Jam) అయింది. వరద ఉధృతికి భిక్నూర్ వద్ద జాతీయ రహదారి కొట్టుకుపోవడంతో కామారెడ్డి నుంచి హైదారబాద్ వైపు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. జంగంపల్లి నుంచి టెక్రియాల్ వరకు 12 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అదేవిధంగా హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో నాగపూర్ వెళ్లే వాహనాలు రాజీవ్ రహదారి మీదుగా కరీంనగర్ గుండా వెళ్లాలని అధికారులు సూచించారు.
అదేవిధంగా ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ మార్గంలో వాహనదారులకు నిర్మల్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్ నుంచి కామారెడ్డి మీదుగా హైదరాబాద్ వెళ్లే వాహనాలు నిర్మల్ సమీపంలో కొండాపూర్ నుంచి మామడ, ఖానాపూర్, మెట్పల్లి, జగిత్యాల, కరీంనగర్ మీదుగా హైదరాబాద్ వెళ్లాలని సూచించారు.
NH-44 turns into a nightmare!
20 KM traffic jam in #Kamareddy as heavy flooding brings vehicles to a standstill. #Telangana #NH44 pic.twitter.com/atBXc2bhuI— Mubashir.Khurram (@infomubashir) August 28, 2025
మరోవైపు భారీ వర్షాల దృష్ట్యా 11 జిల్లాల్లో విద్యాసంస్థలకు అధికారులు సెలవు ఇచ్చారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు వెళ్లొద్దని సూచించారు. ఆదిలాబాద్ జిల్లాలో రాత్రి నుంచి ఏకధాటిగా కురిసిన వానతో పలుచోట్ల చెట్లు విరిగిపడంతో విద్యుత్ తీగలు తెగిపోయాయి. భీంపూర్, తాంసి మండల్లోని 50 గ్రామాలకు రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.