హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాన్ని వర్షాలు ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్నదని, దానికి అనుబంధంగా మరో ఆవర్తన ద్రోణి ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇది ఈనెల 26నాటికి వాయుగుండంగా మారి, 27న విదర్భ వద్ద తీరం దాటే అవకాశాలున్నాయని అంచనా వేసింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే వారం పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మంగళవారం ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసినట్టు పేర్కొన్నది. బుధ, గురువారాల్లో వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు వెల్లడించింది. గడిచిన 24గంటల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురువగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాలలో 11.19 సెం.మీ, యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేటలో 11.14 సెం.మీ, ములుగు జిల్లా మల్లంపల్లిలో 10.70 సెం.మీ, హనుమకొండ జిల్లా ఆత్మకూరులో 10.46 సెం.మీ, జనగామ జిల్లా నర్మెట్టలో 10.16 సెం.మీ, సిద్దిపేట జిల్లా కొండపాకలో 9.57 సెం.మీ, కొమురవెల్లిలో 8.83 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది.