నమస్తే న్యూస్ నెట్వర్క్ : ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లో శుక్రవారం అర్ధరాత్రి దాటాక, శనివారం సాయంత్రం కురిసిన ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం బీభత్సం సృష్టించింది. ఏకధాటిగా గంట పాటు గులకరాళ్ల సైజులో వడగండ్లు పడి వరి పంటలు, తోటలు దెబ్బతిన్నాయి. బలమైన ఈదురు గాలులు వీచి పలు చోట్ల పెంకుటిండ్లు, చెట్లు నేలకొరిగాయి. ఇటుకబట్టీలు వర్షానికి తడిసిపోయాయి. పొట్ట దశలో ఉన్న వరి పంటలు దెబ్బతిన్నాయని అన్నదాతలు, చేతికొచ్చే సమయంలో ఇటుకబట్టీలు వర్షానికి కరిగిపోయాయని వ్యాపారులు లబోదిబోమంటున్నారు. ములుగు జిల్లాలోని వెంకటాపూర్, గోవిందరావుపేట మండలాల్లో, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం, గణపురం మండల కేంద్రంలో వడగండ్ల వర్షం కురిసింది. దీంతో రహదారిపై రాళ్లు కుప్పలుక్పులుగా పడ్డాయి. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి, నర్సింహులపేట మండలాల్లో పెంకుటిండ్లు, వరి పంటలు దెబ్బతిన్నాయి. జనగామ జిల్లాలోని పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి.
శనివారం సాయంత్రం మాదాపూర్‌లో కురిసిన భారీ వర్షంతో జలమయమైన రోడ్డు
కొడకండ్ల మండలం గిర్నితండా సమీపంలో రోడ్డుపై అడ్డంగా భారీ వృక్షం కూలడంతో ఎంపీడీవో, ఏపీవోకు ప్రమాదం తప్పింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గంగాధర, రామడుగు, కరీంనగర్, మానకొండూర్ మండలాలు, రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి, బోయినపల్లి, రుద్రంగితోపాటు పలు మండలాలు, పెద్దపల్లి జిల్లాలోని పలు మండలాలు, జగిత్యాల జిల్లా కొడిమ్యాల, కథలాపూర్, వెల్గటూర్, భీమారం మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షానికి చెట్లు విరిగిపడ్డాయి. భారీ వడగండ్లతో పొట్టదశలోని వరి, నువ్వులు, మామిడి, మిర్చి, చిరుధాన్యాల పంటలు, కూరగాయల తోటలు, ఉమ్మడి పాలమూరు జిల్లాలో వరి, టమాటా, ఇతర పంటలు దెబ్బతిన్నాయి. నవాబ్‌పేట మండలం అమ్మాపూర్, యన్మన్గండ్ల, కొల్లూరు, కోళ్లగుట్టతండా శివారులో ఇటుకల బట్టీలు వర్షానికి తడిసిపోయాయి. వనపర్తి జిల్లాలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆత్మకూర్ పట్టణంలో లోతట్టు కాలనీలోని ఇండ్లలోకి వర్షపు నీరు చేరి స్థానికులు ఇబ్బందులు పడ్డారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంతోపాటు బాన్సువాడ, గాంధారి మండలాల్లో కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో మామిడి కాయలు నేలరాలాయి. నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్‌నగర్ గ్రామ శివారులో ఓ తాటిచెట్టుపై పిడుగు పడింది.