Cyclone Montha: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మొంథా తుఫానుగా (Cyclone Montha) బలపడినట్లు వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా గంటకు 16 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్నది. కాకినాడకు ఆగ్నేయంగా 680 కిలోమీటర్లు, విశాఖకు ఆగ్నేయంగా 710 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైం ఉంది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. మంగళవారం సాయంత్రా కాకినాడ దగ్గర తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ సమయంలో గరిష్టంగా గంటకు 90-100 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు (Hevy Rain) కురుస్తాయని వెల్లడించింది. పలు జిల్లాల్లో 5 సెంటీమీటర్ల నుంచి 20 సెం.మీ. వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. సోమవారం పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
మంగళవారం జయశంకర్-భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. దీంతో ఆ నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సిద్దిపేట, సూర్యాపేట జిల్లాల్లో అక్కడకక్కడా, హైదరాబాద్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ఈ నెల 30వ తేదీ తర్వాత వర్షాల తీవ్రత తగ్గుముఖం పట్టే అవకాశముందని వెల్లడించింది.