Heavy Rains | హైదరాబాద్ : రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి ఆవర్తనం ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో సముద్రమట్టానికి 1.5 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు మధ్య కొనసాగుతూ ఎత్తుకు వెళ్లిన కొలది నైరుతి దిశ వైపునకు వంగి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దాని కారణంగా తెలంగాణలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
అదే విధంగా తూర్పు, పశ్చిమ ద్రోణి సుమారుగా 15 డిగ్రీల అక్షాంశం వెంట సగటు సముద్ర మట్టం నుంచి 4.5 కి.మీ నుంచి 7.6 కి.మీ ఎత్తు మధ్య స్థిరంగా కొనసాగుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు డాక్టర్ కె.నాగరత్న ప్రకటించారు.
అంతేకాకుండా ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, రంగారెడ్డి, నాగర్కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. ప్రజలు వర్షం నేపథ్యంలో ప్రయాణాలు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. దాదాపు అన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.