హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): భారీ వర్షాలు రాష్ర్టాన్ని ఇప్పట్లో వీడే అవకాశాలు కనిపించడంలేదు. నైరుతి రుతుపవనాలు తెలంగాణపై చురుకుగానే కొనసాగుతున్నాయి. వాతావరణంలో పెరిగిన తేమ, అధిక ఉష్ణోగ్రతలలో సాయంత్రం సమయంలో క్యుములోనింబస్ మేఘాలు దట్టంగా ఏర్పడుతుండటంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర అండమాన్ ప్రాంతంలో 30న ఉపరితల ఆవర్తనం, బంగాళాఖాతంలో అక్టోబర్ 1న అల్పపీడననం ఏర్పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఆ ప్రభావంతో వారంపాటు ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అక్టోబర్ 3, 4 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ర్టాంలోని పలు జిల్లాలకు వారంపాటు ఎల్లో అలెర్ట్ జారీచేశారు. ఆదివారం వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసినట్టు తెలిపారు.