Southwest Monsoon | హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ముందుకు విస్తరిస్తున్నాయి. దీనిప్రభావంతో చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రెండు, మూడు రోజుల్లో తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని అధికారులు తెలిపారు. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం రాత్రి నుంచి ఓ మోస్తరు భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్నగర్, గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ నగరంలో సాయంత్రం నుంచి రాత్రి వరకు పశ్చిమ-దక్షిణ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది.
ఈనెల 10వతేదీ వరకు హైదరాబాద్ నగరానికి ఎల్లో అలర్ట్ జారీచేసింది. నాలుగు రోజులు నగరంలో భారీ వర్షాలతోపాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని వనపర్తి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, హైదరాబాద్, యాదాద్రి -భువనగిరి జిల్లాల్లో మోస్తరు వర్షా లు కురిసినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వనపర్తి జిల్లా ఏదుల మండలంలో అత్యధికంగా 5.08 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వికారాబాద్ జిల్లా తాండూరులో 4.73 సెంటీమీటర్లు, చౌదాపూర్లో 3.58, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలో 4.06, రంగారెడ్డి జిల్లా మాడ్గులలో 4.44, వనపర్తి జిల్లా రేవెల్లిలో 3.38, పన్గల్లో 2.72, జోగుళాంబ గద్వాల జిల్లా అ లంపూర్లో 2.56, యాదాద్రి-భువనగిరి జిల్లాలో 2.48సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.