TG Weather | తెలంగాణలో రాగల మూడురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. గురువారం నల్గొండ, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయని పేర్కొంది. శుక్రవారం నల్గొండ, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది.
శనివారం నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడుతాయని హెచ్చరించింది ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఇదిలా ఉండగా.. గడిచిన 24గంటల్లో తెలంగాణవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, సంగారెడ్డి, భువనగిరిలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయని టీజీడీపీఎస్ పేర్కొంది. అత్యధికంగా కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో 7.2 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయ్యింది.