హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో మరో వారంపాటు వర్షాలు జోరుగా కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది. సోమవారం అల్పపీడనం బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారిందని తెలిపింది. తెలంగాణకు ఆనుకొని తూర్పు విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమైందని, దీంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, రంగారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో భారీ వర్షం కురిసిందని వెల్లడించింది. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేటలో అత్యధికంగా 24.24 సెం.మీ వర్షపాతం నమోదైందని తెలిపింది. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో 9.49 సెంటీమీటర్ల వర్షం కురిసిందని, ముషీరాబాద్‌లో పెద్ద ఎత్తున వరద ముంపు ఏర్పడిందని, ముగ్గురు వ్యక్తులు గల్లంతైనట్టు అధికారులు వివరించారు.
మంగళవారం(నేడు) ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడొచ్చని వెల్లడించారు. బుధ, గురువారాల్లో సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేశారు. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేశారు.