హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): ఎల్‌నినో ఎఫెక్ట్‌తో రాష్ట్రం లో భిన్న వాతావరణం కొనసాగుతున్నది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, సాయంత్రం ఒక్కసారిగా చల్లబడి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు ఈ నెల 23, 24 తేదీల నాటికి విస్తరించి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. శనివారం ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం జిల్లాల్లో వడగాడ్పులు వీచాయని, ములుగు జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షం కురిసినట్టు అధికారులు తెలిపారు.