Heavy Rains | తెలంగాణలో రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సోమవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వాయువ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని సగటు సముద్రమట్టానికి 3.1 నుంచి 7.6 కిలోమీటర్ల మధ్య ఎత్తులో ఉన్నట్లు తెలిపింది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
మిగతా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నారాయణపేట జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.