హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): అల్పపీడనం ప్రభావంతో బుధ, గురువారాల్లో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, నాగర్కర్నూల్, హైదరాబాద్ తదితర జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురవవచ్చని హెచ్చరిక జారీచేసింది. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆంధ్రప్రదేశ్ తీరం వెంట స్థిరంగా కొనసాగుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న వివరించారు. అల్పపీడనానికి ఆనుబంధంగా ఉన్న ఆవర్తనం తెలంగాణ వైపు వంగి సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతున్నదని చెప్పా రు. ఉపరితలద్రోణి ఉత్తర కోస్తాంధ్ర నుంచి దక్షిణ ఒడిశా మీదుగా ఛత్తీస్గఢ్ వరకు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించినట్టు తెలిపారు.