నమస్తే నెట్వర్క్, ఆగస్టు 14: పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండో రోజైన గురువారం కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కుండపోత కురిసింది. అశ్వారావుపేటలో గరిష్ఠంగా 12 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. రఘునాథపాలెం మండలం పాపటపల్లి – వీఆర్ బంజర ప్రధాన రహదారిపై బుగ్గవాగు ఉధృతంగా ప్రవహించడంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ మండలంలో పత్తి, వరి, మిర్చి పంటలు నీటమునిగాయి. తిరుమలాయపాలెం మండలంలో ఆకేరు చెక్‌డ్యాం పొంగిపొర్లుతోంది. దుమ్ముగూడెం మండలం మారేడుబాక – సింగవరం గ్రామాల మధ్య మొట్లవాగు పొంగి ప్రవహించడంతో దుమ్ముగూడెం, పౌలూరుపేట గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చండ్రుగొండ మండలంలో గడిచిన 24 గంటల్లో 12.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భద్రాద్రి జిల్లాలోని పలు చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి.
బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షం మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అనేక చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పలు గ్రామాలు, పట్టణాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లి వద్ద ఐటీ పార్కు జాతీయ రహదారి 44తో లింకు చేసిన నాలుగు లేన్ల రహదారి తెగిపోయింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న అమరరాజ కంపెనీ మినీ బస్సు కొట్టుకుపోయిన రోడ్డుపై ప్రమాదానికి గురైంది. కార్మికులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకొని స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మూసాపేట మండలం పోల్కంపల్లి పెద్దవాగులో వెయ్యి గొర్రెలు, 11 మంది కాపరులు చిక్కుకోగా ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందం గొర్రెలను వాగుదాటించి కాపరులను సురక్షితంగా రక్షించారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వర్షం దంచికొట్టింది. భారీ వర్షాలతో జిల్లాలోని మూసీ, కాగ్నా నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఫలితంగా పలు చోట్ల వాహనాల రాకపోకలు స్తంభించాయి. కాగ్నా నది ప్రమాదకర స్థాయిలో వరద పారుతుండటంతో బషీరాబాద్ మండలంలోని జీవంగి, వీరశెట్టిపల్లి గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పరిగి మండలంలో 12.7 సెంటీమీటర్లు, దోమ మండలంలో 11.85 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా ములుగు జిల్లా వెంకటాపురం నూగూరు మండల పరిధిలో పాత్రాపురం జీపీ లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఆశవర్కర్ లక్ష్మి (60) బుధవారం సాయంత్రం బండలవాగులో గల్లంతు కాగా, గురువారం ఆమె మృతదేహం దొరికింది.
వీడని వర్షముప్పు
రాష్ర్టానికి మరో ఆరు రోజుల పాటు వర్షముప్పు ఉన్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడన ప్రభావం, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6 మీటర్ల ఎత్తులో కొనసాగుతుందని తెలిపింది. 24 గంటల్లో వాయవ్య దిశలో కదిలి ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతానికి ఇది చేరుకునే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. దీంతో ఈ నెల 20వ తేదీ వరకు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. కాగా, నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రానున్న 24 గంటల్లో జగిత్యాల, జయశంకర్-భూపాలపల్లి, కరీంనగర్, మహబూబాబాద్, మంచిర్యాల, నిర్మల్, ములుగు, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. దీంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, భదాద్రి-కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జనగామ, కామారెడ్డి, ఖమ్మం, కుమ్రం భీం ఆసిఫాబాద్, మెదక్, మేడ్చల్-మల్కాజిగిరి, రాజన్నసిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, వరంగల్ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
అధిక వర్షపాతం నమోదు
రాష్ట్రవ్యాప్తంగా జూన్ 1 నుంచి గురువారం వరకు 9 శాతం అధిక వర్షపాతం నమోదైంది. జూన్ నుంచి ఆగస్టు 14 వరకు రాష్ట్ర సాధారణ సగటు వర్షపాతం 498.9 మి.మీ ఉండగా, 534.8 మి. మీ వర్షపాతం నమోదైంది. ఆగస్టు నెల సగటు సాధారణ వర్షపాతం 215.8 మి. మీ ఉండగా, గురువారం వరకు 100.1 మి. మీ కురవాల్సి ఉంది. కానీ 156.8 మి. మీ వర్షపాతం నమోదైంది. ఇది ఈనెల సాధారణ సగటు వర్షపాతంతో పోలిస్తే 57 శాతం అధికమని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. జూన్ నెలలో 20 శాతం లోటు వర్షపాతం నమోదవ్వగా, జూలైలో 5 శాతం అధికంగా నమోదైంది. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో లోటు వర్షపాతం కొనసాగుతున్నది. నాగర్‌కర్నూల్‌లో 80, మహబూబ్‌నగర్‌లో 76, వనపర్తిలో 66, రంగారెడ్డి 63, నారాయణపేట జిల్లాలో 63శాతం అత్యంత అధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా సగటున 2.72 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో అత్యధికంగా 14.76 సెం.మీ వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో 33.8 డిగ్రీలు నమోదైనట్టు అధికారులు వివరించారు.
కృష్ణమ్మ పరుగులు
కర్నాటక, మహారాష్ట్రతోపాటు రాష్ట్రంలో విస్తృతంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణా, తుంగభద్ర బేసిన్లలో వరద పోటెత్తుతున్నది. కృష్ణమ్మ పరుగులు పెడుతున్నది. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యామ్‌లు పూర్తిస్తాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరువకాగా ఆయా ప్రాజెక్టుల నుంచి వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. రాష్ట్రంలో జూరాల, శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులకు భారీగా వరద కొనసాగుతున్నది. మహారాష్ట్రతోపాటు రాష్ట్ర క్యాచిమెంట్ ఏరియాలోనూ కురుస్తున్న వర్షాలతో ప్రధాన గోదావరిలో ఎస్సారెస్పీకి, ఎల్లంపల్లికి సైతం స్వల్పంగా వరద ప్రవాహం ప్రారంభమైంది. ఇదిలా ఉండగా ప్రాణహితలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. లక్ష్మీబరాజ్ వద్ద గురువారం సాయంత్రానికి 3.41లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతున్నది.
మీడియం ప్రాజెక్టులు.. చెరువుల్లో అంతంతే..
గత కొద్దిరోజులుగా వానలు కురుస్తున్నా ఇప్పటికీ అనేక మీడియం ప్రాజెక్టులు, చెరువులు నిండలేదు. గోదావరి, కృష్ణా బేసిన్లో మొత్తంగా 36 మీడియం ప్రాజెక్టుల్లో కలిపి 62టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యముండగా, ఇప్పటికీ 45టీఎంసీల మేరకు మాత్రమే జలాలు వచ్చాయి. కృష్ణా బేసిన్‌లోని వైరా, కోటిపల్లి వాగు, బయ్యారం, మూసి ప్రాజెక్టులు మాత్రమే మత్తడి దూకుతున్నాయి. గోదావరి బేసిన్లో పెద్దవాగు, పాలెంవాగు ప్రాజెక్టులు తప్ప మరే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండని పరిస్థితి. రాష్ట్రవ్యాప్తంగా 34,741చెరువులు ఉండగా, అందులో 15661చెరువులు ఇప్పటికీ 50శాతం నిండుకోలేదు. 14216చెరువులు మాత్రమే 50 శాతం నుంచి 75శాతం మేర నిండుకున్నాయి. కేవలం 3124చెరువులు మాత్రమే పూర్తిస్థాయిలో నిండని మత్తడి పోస్తున్నాయి.
వివిధ రిజర్వాయర్లలో నీటిమట్టం వివరాలు..