హైదరాబాద్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గాలులు పశ్చిమ, నైరుతి దిశ నుంచి రాష్ట్రం వైపు వీస్తున్నాయని పేర్కొన్నది. జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, ములుగు, కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, సంగారెడ్డి, పెద్దపల్లి, హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వివరించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొన్నది.
హైదరాబాద్లో ఆదివారం తెల్లవారుజాము నుంచే చిరుజల్లులు కురుస్తున్నాయి. ఆకాశం మొత్తం మేఘావృతమై ఉన్నది. శనివారం సాయంత్రం హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.