Monsoon | హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు నిర్దేశించిన సమయం కంటే ముందే దేశంలోకి ప్రవేశించినప్పటికీ.. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నది. రుతుపవనాల ప్రారంభమైన జూన్ మొదటి వారంలో మోస్తరు వర్షాలు కురిసినప్పటికీ..ఆశించిన స్థాయిలో భారీ వర్షాలు లేవు. దీంతో రైతులు నిరాశకు గురవుతున్నా రు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ప్రభావంతో సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసినప్పటికీ..ప్రస్తుత పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. జూన్ 3న రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు.. జూన్ 5 వరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించాయి. జూన్ మొదటి వారంలో ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాల మినహా అన్ని జిల్లాల్లో సాధారణం నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.
మొదలుకాని వ్యవసాయ పనులు
తొలకరి వర్షాలకు వ్యవసాయ పనులు మొదలుపెట్టాలని భావించిన రైతులకు నిరాశే మిగిలింది. సీజన్ ప్రారంభమై రెండు వారాలై ఇప్పటివరకు ఒక్క భారీ వర్షం లేదు. ఇది వ్యవసాయ పనులపై ప్రభావం చూపే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నెల మొదటి వారం లో కురిసిన తొలకరికి కొన్ని జిల్లాల్లో రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించారు. రైతులు పత్తి, మక్కజొన్న,పెసర పంటలు సాగు మొద లు పెట్టారు. ఆ తర్వాత వానలు ముఖం చాటేయడంతో విత్తనాలు మొలకెత్తే పరిస్థితులు కనిపించక ఆందోళనకు గురవుతున్నారు. భారత వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం జూన్ 1నుంచి జూన్ 16 మధ్య కాలంలో రాష్ట్రంలో ని 14 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. మంచిర్యాల, హనుమకొండ,కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అత్యంత లోటు వర్షపాతం నమోదైంది. ఈ లోటు వర్షపాతం ఆయా జిల్లాల రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది.
జూలైలో భారీ వర్షాలు
రుతుపవనాలు ప్రవేశించినప్పటి నుంచి ప్రతి రోజు రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయ ని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి డాక్టర్ శ్రావణి తెలిపారు. ఆదివారం వరకు రాష్ట్ర సాధారణ వర్షపాతం 61.2 మి.మి కాగా.. ఇప్పటికే 69.8 మి.మీ వర్షపాతం నమోదైనట్టు తెలిపారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ములుగు తదితర జిల్లాల్లో మొదటివారం వర్షాలు కురిసినప్పటికీ.. రెండోవారం వీచిన వేడిగాలుల ప్రభావంతో లోటు వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. జూన్ 30నాటికి లోటు వర్షపాతం నమోదైన జిల్లాల్లో కూడావానలు పుంజుకొని సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని తెలిపారు. రుతుపవనాల ప్రభావం ప్రస్తుతం ఉత్తర భారతదేశంలో కొనసాగుతుందని, జూన్ చివరి నాటికి ఆ ప్రభావం రాష్ట్రంవైపు మళ్లుతుందన్నారు. దీని ప్రభావంతో జూలై మొదటి వారంలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ ఏడాది రుతుపవనాల ప్రభావంతో వర్షాలు సాధారణం కంటే ఎక్కువగానే నమోదవుతాయని శ్రావణి వెల్లడించారు.