కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వాన బీభత్సం సృష్టించింది. బుధవారం తెల్లవారుజామున కురిసిన భారీ వానతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. వానకు ఈదురుగాలులు తోడవడంతో పలుప్రాంతాల్లో విద్యుత్ నిలిచిపోయింది, మామిడి నేలరాలింది. కరెంట్ స్తంభాలు విరిగిపోయాయి. జగిత్యాలలో పిడుగుపాటుకు ఇద్దరు గాయపడగా, 43 మేకలు మృతిచెందాయి.
ఉమ్మడి జిల్లాలోని బీర్పూర్, వెల్గటూర్, గొల్లపల్లి, కోనరావుపేట, గోదావరిఖని, గంగాధర, మానకొండూరు, రామడుగు మండలాల్లో భారీగా వర్షం కురిసింది. బీర్పూర్ మండలంలో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలాయి.
పెద్దపల్లి జిల్లాలో మంథని, ముత్తారం, రామగిరి, కమాన్పూర్ మండలాల్లో భారీ వాన కురిసింది. తెల్లవారుజామున కురిసిన వర్షానికి మంథని, పెద్దపల్లిలోని మార్కెట్ యార్డుల్లో, పలు కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసిపోయింది.
జగిత్యాల జిల్లా ధర్మపురి, బుగ్గారం, సారంగాపూర్, మల్యాల మండలంలో జోరుగా వానపడింది. మల్యాల మండలం బల్వంతాపూర్లో పిడుగుపడి ఇద్దరికి గాయాలయ్యాయి. 43 మేకలు మృతిచెందాయి.
ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుండపోతగా వర్షం కురిసింది. కుమ్రం భీమ్, మంచిర్యాలలో భారీ వానపడింది. మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలో ఈదురు గాలులతో మామిడి కాయలు రాలిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వడ్లు వాన నీటిలో కొట్టుకుపోయాయి.