అలంపూర్ చౌరస్తా, సెప్టెంబర్ 4 : వ్యవసాయం కలిసి రాకపోవడంతో అప్పులు మిగిలి దిగులు చెందిన రైతు గుండెపోటుతో మరణించాడు. ఈ విషాదకర ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. ఉండవల్లి మండలం మారుమునగాల-2కు చెందిన రైతు చిన్నబోయ లక్ష్మన్న(38)కు ఎకరం పొలం ఉన్నది. మరో 30 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి, మిరప, ఉల్లి సాగు చేశాడు. ఈ సీజన్లో భారీ వర్షాలు కురవడంతో పంటలు దెబ్బతిన్నాయి. పొలంలో వర్షపునీళ్లు నిలిచిపోవడంతో తెగుళ్లుసోకి పంట దెబ్బతిన్నది. పంట పెట్టుబడికి దాదాపు రూ.20 లక్షల వరకు అప్పు చేశాడు. పంట నష్టంతో అప్పు తీర్చే మార్గం కనిపించక నిత్యం మనోవేదనకు గురయ్యేవాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం పొలం వద్దకు వెళ్లిన రైతుకు. గుండెపోటు రావడంతో స్పృహ తప్పి పడిపోయాడు. పక్క పొలంలోని రైతులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
వెల్దుర్తి, సెప్టెంబర్ 4: అప్పుల భారంతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని శేరీల గ్రామంలో చోటుచేసుకున్నది. వెల్దుర్తి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శేరీల గ్రామానికి చెందిన చేకూరి బాబు (40) మూడేండ్ల క్రితం ట్రాక్టర్ కొనుగోలు చేయడంతోపాటు కొద్దినెలల క్రితం ఇంటి మరమ్మతుల కోసం అప్పు చేశాడు. మొత్తం అప్పులు రూ. 20 లక్షల వరకు ఉన్నాయి. వీటిని తీర్చే మార్గం లేక కొద్దిరోజులుగా తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నాడు. గురువారం ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి వెళ్లిన బాబు వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన చుట్టుపక్కల వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.