హైదరాబాద్ జూలై 19 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ముఖ్యంగా 9జిల్లాల్లో భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించింది.
అధికార యంత్రాంగం కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసి వరదలపై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించింది. ఆది, సోమవారాల్లో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, యానాంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి.. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. రాయలసీమలోనూ ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నది.