Monsoon | హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ప్రస్తుతం రుతుపవనాలు లక్షద్వీప్, కేరళ రాష్ట్రంలో పూర్తి గా.. కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించాయి. వచ్చే రెండ్రోజుల్లో మధ్య అరేబియన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, గోవా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దక్షిణ కొంకణ్ తీరంలో రత్నగిరి, దాపోలి మధ్యలో వాయుగుండం తీరం దాటే అవకాశమున్నట్టు పేర్కొన్నది.
ఈనెల 27న పశ్చిమ మధ్య, సమీప ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్టు వివరించింది. దీంతో రెండ్రోజులపాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అకడకడ ఉరుములు, మెరుపులతో గంటకు 30నుంచి 40 కిలోమీటర్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసినట్టు పేర్కొన్నది. సోమ, మంగళవారాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురవడంతోపాటు, పలు ప్రాంతాల్లో పిడుగులు పడేఅవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిం ది.
మరోవైపు అరేబియా సముద్రంలోని వాయుగుండం, ఉత్తర బంగాళాఖాతం లో ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మూడ్రోజులు భారీ వర్షాలతోపాటు, సముద్ర తీరం వెంబడి గంటకు 40-50కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కాగా ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలో అత్యధికంగా 12.52సెం.మీ వర్షపాతం నమోదైంది.