హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణశాఖ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. బాలాసోర్‌కు 180కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం.. పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్‌ల మధ్య తీరం దాటనున్నదని తెలిపింది.
ఈ వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ర్టాల్లో వచ్చే మూడ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. దీంతో పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్‌లను జారీచేసినట్టు తెలిపింది. ఈ వాయుగుండం తుపానుగా మారే అవకాశం కూడా ఉన్నదని హెచ్చరించింది. గురువారం 11:30గంటలకు సాగర్ ద్వీపం-ఖేపుపారా మధ్య పశ్చిమబెంగాల్-బంగ్లాదేశ్ తీరాలను దాటిందని వెల్లడించింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించడంతో పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయని పేర్కొన్నది.