Rains | హైదరాబాద్, జూలై 8 (నమస్తేతెలంగాణ): రుతుపవన ద్రోణి ప్రభావంతో రాబోయే మూడురోజులు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మంగళవారం ఆదిలాబాద్, కుమ్రంభీం-ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో అక్కడక్కడా వర్షం కురిసింది. బుధవారం మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. జగిత్యాల, రాజన్న-సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్-భూపాలపల్లి, ములుగు, భదాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురుస్తాయని అంచనా వేసింది.
గురువారం రాష్ట్రంలోని ఆదిలాబాద్, కుమ్రంభీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే కురుస్తాయని తెలిపింది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న-సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్-భూపాలపల్లి, ములుగు, భదాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా వానలు కురుస్తాయని, దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో నిజామాబాద్ జిల్లా నవీంపేటలో అత్యధికంగా 2.70 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.