హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): రానున్న మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురువారం కోస్తా ఆంధ్రకు దగ్గర బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఆవర్తనం శుక్రవారంనాటికి బలపడింది. ఆదివారం ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో మరో ఆవర్తన ద్రోణి ఏర్పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ప్రభావంతో శనివారం నుంచి 8వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. శని, ఆది, సోమవారాల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడే అవకాశమున్నదని తెలిపింది. శని, ఆది, సోమవారాల్లో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం లేదా చినుకులు పడే అవకాశం ఉన్నదని వెల్లడించింది. ఎల్నినో ప్రభావంతో ఆగస్టు నెలలో ముఖం చాటేసిన వానలు సెప్టెంబర్లో మళ్లీ పలుకరిస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొన్నది. దక్షిణ, మధ్య భారత్లో ఈ వారం వానలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు.