హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి అల్పపీడనంగా బలపడిందని.. రానున్న 24 గంటల్లో మరింతగా బలపడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే మూడ్రోజులు రాష్టవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండగా, ఉమ్మడి కరీంనగర్, వరంగల్, మెదక్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల పరిధిలో భారీ వర్షాలు కురుస్తున్నట్టు తెలిపింది. ములుగు జిల్లాలో రెండురోజుల్లో అత్యంత భారీగా 46 సెం.మీ వర్షపాతం నమోదైందని వెల్లడించింది.
గురువారం వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, సూర్యాపేట, భదాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినట్టు పేర్కొన్నది. శుక్ర, శనివారాల్లో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, వరంగల్, జనగామ, మెదక్, కామారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. గడిచిన 24గంటల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైనట్టు తెలిపింది. అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరులో 23.98 సెం.మీ, చింతలమానేపల్లిలో 19.72 సెం.మీ, ములుగు జిల్లా వెంకటాపురంలో 18.72 సెం.మీ, ఏటూరునాగారంలో 11.31 సెం.మీ, కరీంనగర్లో 12.51 సెం.మీ, మానకొండూరులో 9.98 సెం.మీ, హైదరాబాద్ జిల్లా ముషీరాబాద్‌లో 11.38 సెం.మీ వర్షపాతం నమోదైంది.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలో దిందా గ్రామానికి చెందిన 12మంది కూలీలు బుధవారం వాగు దాటి గూడెంలో వరి నాటు వేసేందుకు వెళ్లారు. సాయంత్రం ఇండ్లకు వస్తున్న క్రమంలో వాగు ఉప్పొంగడంతో రాత్రంతా గూడెంలోనే ఉన్నారు. గురువారం కూడా వాగు ఉధృతికి భయపడి వెనక్కి తగ్గారు. చివరకు గూడెం నుంచి బొలెరో వాహనంలో కోర్సినికి చేరుకున్నారు. అక్కడి నుంచి అడవిలో సుమారు పది కిలోమీటర్లు వర్షంలో నడిచి సాయంత్రం గ్రామానికి చేరుకున్నారు. ఇదిలా ఉండగా ములుగు జిల్లా వెంకటాపురం మండలం మల్లాపురం గ్రామశివారులోని పాలెంవాగు ప్రాజెక్టు ప్రధాన కాల్వకు గురువారం బుంగపడి నీరు వృథాగా పోయింది. దీంతో అక్కడి ఆయకట్టు రైతులు సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించలేదు. దీంతో రైతులందరూ కలిసి జేసీబీని తెప్పించి బుంగను పూడ్చివేశారు.
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. గురువారం ఢిల్లీలో ఉన్న ఆయన సీఎంవో అధికారులతో మాట్లాడారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.
వాతావరణ మార్పులతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున తక్షణమే ఆయా జిల్లాలకు వెళ్లి ప్రభుత్వ దవాఖానలను సందర్శించాలని అధికారులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో రోడ్లు, కల్వర్టులు దెబ్బతిని ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్నందున ఆర్అండ్బీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు.