Rain | హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తేతెలంగాణ): బంగాళాఖాతంలో అల్పపీడనాల సంఖ్య, వాటి తీవ్రత పెరుగుతున్నది. దీంతో తుపాన్లుగా మారి కుంభవృష్టి కురిపించడాన్ని వాతావరణ నిపుణులు అసాధారణమైనదిగా విశ్లేషిస్తున్నారు. వాతావరణ మార్పులు, భూతాపంతో మహాసముద్రాలు వేడెక్కి బీభత్సమైన వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంటున్నారు. అందుకు నిదర్శనమే ఈ సంవత్సరం నైరుతి సీజన్ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
జూన్ 28, జూలై 15,19, ఆగస్టు 3,29, సెప్టెంబర్ 5,13,23 తేదీల్లో బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడ్డాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలకు లానినో ప్రభావం తోడవ్వడంతో ఇటీవల విజయవాడ, ఖమ్మం ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. ఈసారి రుతుపవనాల నిష్క్రమణ ఆలస్యం కావడంతో రాష్ట్రంలో మరిన్ని వర్షాలు కురిసే అవకాశమున్నట్టు భారత వాతావరణ శాఖ విశ్రాంత డైరెక్టర్ జనరల్ డాక్టర్ కేజే రమేశ్ తెలిపారు.
రాష్ట్రంలో రాగల మూడురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వాయవ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం.. పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తున్నదని పేరొన్నది. గురువారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న-సిరిసిల్ల,కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి, వరంగల్, హన్మకొండ, ఖమ్మం, మహబూబాబాద్, జనగామతోపాటు పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. 24గంటల్లో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో అత్యధికంగా 12.03 సెం.మీ వర్షపాతం నమోదైంది.