హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే ఐదురోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ద్రోణి మరింత బలపడటంతో సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసినట్టు తెలిపింది. వర్షాలు కురుస్తున్న సమయంలో గంటకు 30నుంచి 40కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. భారీ వర్షాల నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీచేసిన జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. శని, ఆదివారాల్లో నల్లగొండ, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. 11,12,13 తేదీల్లో అన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది.
వర్షాలపై అధికారులతో సీఎం సమీక్ష
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిచారు. నగరంలో వర్షాలతో తలెత్తుతున్న ఇబ్బందులు, వరద సమస్యకు శాశ్వత పరిషారంపై ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా రోడ్లపై నీరు నిలువకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.