Rain Alert | హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రాబోయే ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభావంతో వర్షాలు కురువొచ్చని తెలిపింది. మరో వారం రోజుల్లో ఇంకో అల్పపీడనం ఏర్పడొచ్చని, కాబట్టి ఈ నెల 25 వరకూ వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా సోమవారం మంచిర్యాల, జయశంకర్-భూపాలపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసింది.
మంచిర్యాల జిల్లా వేమనపల్లిలో అత్యధికంగా 13.86 సెంటీమీటర్ల (సెం.మీ) వర్షపాతం నమోదైంది. హైదరాబాద్లోని మారేడుపల్లిలో 6.73 సెం.మీ. వర్షం కురిసింది. కాగా, ఈ ఏడాది జూన్ 1 నుంచి జూలై 15 (సోమవారం) వరకు రాష్ట్రంలో 258.6 మిల్లీమీటర్ల (మి.మి) వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. గత ఏడాది ఇదే సమయానికి 189.5 మిల్లీమీటర్లు నమోదైంది. అయితే ఇప్పటికీ దాదాపు 102 మండలాల్లో లోటు వర్షపాతం ఉన్నది.