హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): నగరంలో బుధవారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. దాదాపు నగరంలోని రహదారులన్నీ వరద కాల్వలను తలపించాయి. ఉద్యోగులు, ప్రయాణికులు ఇండ్లకు చేరుకోవడానికి నరకం చూశారు. గచ్చిబౌలీ, మియాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, సికింద్రాబాద్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించి వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాల్సిన దుస్థితి ఏర్పడింది.
ముఖ్యంగా హెచ్సీయూ, మియాపూర్, బంజారాహిల్స్, లింగంపల్లి, గచ్చిబౌలీ, చందానగర్, హఫీజ్పేట్, ఫతేనగర్, ఆర్సీపురం, బీహెచ్ఈఎల్, కేపీహెచ్బీ, మూసాపేట తదితర ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. అత్యధికంగా శేరిలింగంపల్లి సర్కిల్ హెచ్సీయూలో 12.6 సెం.మీ వర్షపాతం నమోదైంది. మియాపూర్లో 11.23 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాగల రెండు రోజుల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు.
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రానున్న 3 రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దేశం నుంచి రుతుపవనాలు తిరోగమనం చెందుతున్న సమయంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని ఇదే పరిస్థితి మరో వారం ఉంటుందని పేర్కొంది. అక్టోబర్ 1 నాటికి దేశం నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమిస్తాయని స్పష్టంచేసింది. ఈ క్రమంలో పలు జిల్లాల్లో క్రమంగా సాధారణ పగటి ఉష్ణోగ్రతలు పెరిగి.. రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశముందని తెలిపింది.
బుధవారం ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, వరంగల్, నల్లగొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసినట్టు అధికారులు వెల్లడించారు. హనుమకొండ జిల్లా ఖాజీపేటలో అత్యధికంగా 6.38 సెంటీమీటర్ల వర్షం కురిసిందని పేర్కొన్నారు. ఇవాళ, రేపు కూడా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు అంచనా వేశారు. నైరుతిలో సాధారణం కంటే 60 నుంచి 87 శాతం అధిక వర్షం కురిసిందని తెలిపింది.