Cyclone Montha | హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతం తీరం అల్లకల్లోలంగా మారింది. బంగాళాఖాతం దాని పరిసరాల్లో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం ఆదివారం రాత్రి బలపడి ఆగ్నేయ బంగాళాఖాతంలో ‘మొంథా’ తుపానుగా (Cyclone Montha) మారినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మొంథా తుపాను వాయవ్య దిశలో కదిలి సోమవారం ఉదయం నైరుతి బంగాళాఖాతం దాని సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకున్నట్టు వెల్లడించింది. ఈ తీవ్ర తుపాను ఉత్తర, వాయవ్య దిశలో కదులుతూ.. మచిలీపట్నం-కళింగపట్నం మధ్యలో కాకినాడకు సమీపంలో మంగళవారం రాత్రి సమయంలో ఏపీ తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్టు అంచనా వేసినట్టు పేర్కొన్నది. ఈ తుపాను తీరాన్ని దాటే సమయంలో ఈదురుగాలులు గంటకు 90 నుంచి 110 కి.మీ వేగంతో వీస్తాయని వివరించింది.
దీని ప్రభావంతో మంగళవారం పెద్దపల్లి, జయశంకర్-భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్టు తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి-భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు తెలిపింది.
అప్రమత్తమైన రైల్వే, విమానయాన శాఖలు
మొంథా తుపాను నేపథ్యంలో ఈస్ట్‌కోస్ట్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే పలు రైలు సర్వీసులను మూడు రోజులపాటు రద్దు చేసినట్టు ప్రకటించింది. పలు విమానాలను విజయవాడ నుంచి రద్దు చేస్తున్నట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఎయిర్ ఇండియాకు చెందిన పలు విమానాలు విజయవాడ నుంచి రద్దు చేసున్నట్టు ఎయిర్‌పోర్టు అథారిటీ తెలిపింది.