 
                                                            హుస్నాబాద్ టౌన్, అక్టోబర్ 30: ‘ఎటుచూసినా రైతుల ఏడుపులతో గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ ఘొళ్లుమన్నది. రైతుల కంట నీరు కన్నీటి వరదలా పారింది. ఆరుగాలం కష్టించి పండించిన పంట వరద పాలైందని రైతులు గుండెలవిసేలా రోదించారు. మొంథా తుపాను ప్రభావంతోపాటు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టలేని మార్కెట్ కమిటీ అధికారుల నిర్లక్ష్యానికి రైతుల ధాన్యం వరద పాలైంది.
హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డు కొద్దిరోజులుగా ధాన్యం రాశులతో కళకళలాడుతున్నది. పండించిన పంటను విక్రయించేందుకు కొందరు, ఆరబోసేందుకు మరికొందరు దాదాపు రెండువందల మందికిపైగా రైతులు ధాన్యాన్ని మార్కెట్ యార్డుకు తెచ్చారు. ఇందులో పదిహేను రోజులు, పదిరోజులు, వారం రోజుల కిందట తెచ్చిన ధాన్యం కూడా ఉన్నది. నిబంధనల ప్రకారం 17% లోపు మాయిశ్చర్ రాకపోవడంతో ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అధికారులు ముందుకు రాకపోవడంతో షెడ్లు, ప్లాట్ఫారలపై రైతులు ధాన్యాన్ని ఆరబోసుకున్నారు.
ఆరు ట్రిప్పుల వడ్లు పండినయి. వాటిని ఐదురోజల కిందట హుస్నాబాద్ మార్కెట్కు తెచ్చినం. వడ్లు కూడా ఎండినయి. కప్పు వేసి రాళ్లు కూడా పెట్టిపోయినం. ఈడ సార్లకు సూపిచ్చినం. సాంపిల్ తీస్తమని చెప్పిండ్రు. తెల్లారేవరకు నాలుగున్నర ట్రిప్పుల వడ్లు వాన నీళ్లల్ల కొట్టుకుపోయినయి. ఏంజేసి బతకాలే అర్థమైతలేదు. మమ్మల్ని ఎవ్వలు ఆదుకుంటరో దేవుడా.
-గూళ్ల రాజవ్వ, రైతు, హుస్నాబాద్ (సిద్దిపేట జిల్లా)
 
                            