హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి (Heavy Rain). దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల రోడ్లు, కల్వర్టులు తెగిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇండ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట పొలాలు నీట మునగడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. రాష్ట్రంలో అత్యధికంగా ములుగు జిల్లా మంగపేటలో 18.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఏటూరునాగారం 16.1, వెంకటాపురం (ములుగు)లో 12.1 సెం.మీ., జైనథ్ (ఆదిలాబాద్)లో 11.6, మల్లూరు (ములుగు)లో 11.6 సెం.మీ., వాంకిడి (ఆసిఫాబాద్)లో 11.3, సాత్నాల (ఆదిలాబాద్)లో 11, ములుగు జిల్లా తాడ్వాయిలో 10.4, కన్నాయిగూడెంలో 10.2, ధర్మవరంలో 10.2, మేడారంలో 10.2, ఆదిలాబాద్ జిల్లా సిరికొండ 9.7, రాంనగర్ 8.9, గుడిహత్నూరులో 8.9, జంబుగ (ఆసిఫాబాద్)లో 8.6 సెం.మీ., సర్వాయిపేట (భూపాలపల్లి) 8, ధనోరా (ఆసిఫాబాద్) 7.5, ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనలో 7.5, కెరమెరిలో 7.3, ఆదిలాబాద్ అర్బన్‌లో 7.1, బిక్నూర్ (కామారెడ్డి) 6.8, వాజేడు (ములుగు) 6.7, ఉట్నూరు (ఆదిలాబాద్) 6.5, సిర్పూర్ (టి) (ఆసిఫాబాద్) 6.4, ఇచ్చోడ 6.3, మెదక్ జిల్లా కాగజ్‌మద్దూరులో 6.2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదయింది.
ఇక హైదరాబాద్‌లో అత్యధికంగా 5.2 సెంటీమీటర్లు వర్షపాతం కురిసింది. చందానగర్‌లో 4.7 సెం.మీ., హైదర్‌నగర్ 4.6, లింగపంల్లి 4.6, పటాన్చెరు 4.4, కేపీహెచ్‌బీ, యూసుఫ్‌గూడ, షేక్‌పేట, రామచంద్రాపురం, హఫీజ్‌పేటలో 4.3 సెంటీమీటర్లు, బంజారాహిల్స్, బోరబండ, కూకట్‌పల్లిలో 4.2 సెం.మీ., గచ్చిబౌలి 4.1, బాలానగర్ 3.9, ఖైరతాబాద్ 3.9, మాదాపూర్ 3.8, ముషీరాబాద్ 3.6, ఫిల్మ్‌నగర్ 3.6 సెం.మీ. వర్షపాతం నమోదయింది.
గోదావరీ పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో భద్రాచలం వద్ద క్రమంగా నీటిమట్టం పెరుగుతున్నది. మంగళవారం ఉదయం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 37 అడుగులు దాటింది. దీంతో స్నానఘట్టాల వద్ద మెట్లు మునిగిపోయాయి. కల్యాణకట్ట వరకు వరద నీరు చేరడంతో స్నానాలకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. లాంచీలు, పడవలు, గజఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. గోదావరి వరదతో పర్ణశాల వద్ద నార చీరల ప్రాంతం నీటమునిగింది.