అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడిలో 36.15, ఆసిఫాబాద్లో 31.48, నల్లగొండ జిల్లా గుండ్లపల్లి మండలం యర్రారంలో 25.10, జగిత్యాల జిల్లా రాయికల్లో 23.05, వరంగల్ రూరల్ జిల్లా నడికుడలో 21.10 సెంటీమీటర్ల అత్యంత భారీ వర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో పలు జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో 10 సెంటీ మీటర్లకు పైగా వర్షం కురిసింది. శని, ఆదివారాలలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలోని వాయువ్య బంగాళాఖాతంలో గురువారం ఏర్పడిన అల్పపీడనం బలపడి శుక్రవారం తీవ్ర అల్పపీడనంగా మారింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటున 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతున్నది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. రాగల 24 గంటల్లో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు.. భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, తేలిక పాటి నుంచి ఒక మాదిరి వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది.