GHMC | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు వాన దంచికొట్టింది. దీంతో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం 8.30 గంటల వరకు బీహెచ్ఈఎల్లో అత్యధికంగా 8.53 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మలక్‌పేటలో అత్యధికంగా 4.68 సెంటీమీటర్ల వర్షం కురిసిందని టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు. గ్రేటర్లో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వానలు తగ్గుముఖం పట్టాయి.
తీరం దాటిన వాయుగుండం 24 గంటల్లో బలహీనపడి, అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నదని, దీని ప్రభావంతో గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశాలున్నట్టు అధికారులు వివరించారు.
మరోవైపు, ఆదివారం ఉదయం దానకిశోర్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, కలెక్టర్ అనుదీప్, ఇతర అధికారులు విస్తృతంగా పర్యటించి క్షేత్రస్థాయి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. సహాయక చర్యలకు 610 అధికారిక బృందాలు ఫీల్డ్‌లో ఉన్నాయని దానకిశోర్ తెలిపారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకి రావొద్దని సూచించారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో చినుకుపడితే చీకటే అన్నట్టుగా పరిస్థితి తయారైంది. వానొచ్చినా, వరదొచ్చినా అంధకారం నెలకొంటున్నది. శని, ఆదివారాల్లో చెట్లు, చెట్ల కొమ్మలు విరిగిపడుతుండటంతో పలుచోట్ల విద్యుత్తు లైన్లు చెడిపోయాయి. ఆయా చెట్లను తొలగించేందుకు అర్ధరాత్రి సిబ్బంది శ్రమిస్తున్నారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షం సహాయచర్యలకు ఆటంకం కలిగిస్తోంది.